హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై  వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 9వ తేదీన ఈ విషయమై ప్రకటన చేయనున్నట్టుగా ఆమె వెల్లడించారు.హైద్రాబాద్ లోటస్‌పాండ్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నేతలతో మంగళవారం నాడు ఆమె సమావేశమయ్యారు. ఈ సమావేశంలో షర్మిల మాట్లాడారు.

తాను ఎవరూ వదిలిన బాణం కాదని ఆమె తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ లేదా, బీజేపీకి బీ టీమ్ గా ఉండాల్సిన అవసరం లేదని ఆమె తేల్చి చెప్పారు.  సమస్యల పరిష్కారం కోసం తాను పార్టీ పెడుతున్నానని వివరించారు.ఖమ్మం వేదికగానే సమరశంఖం పూరిస్తానని ఆమె చెప్పారు. ఈ మేరకు పార్టీ ఏర్పాటు, విధి విధానాలపై ఖమ్మం నేతలకు వివరించారు.

ఖమ్మం జిల్లా పాలేరు నుండి పోటీ చేయాలని షర్మిలను అభిమానులు కోరారు. తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులతో ఆమె సమావేశాలు నిర్వహిస్తున్నారు.పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఆయా జిల్లాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను ఆమె నేతల నుండి సేకరిస్తున్నారు.