తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైఎస్ షర్మిల. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా బుధవారం లోటస్ పాండ్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ మూడు ఎకరాల భూమి ఏమయ్యిందో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని నిలదీశారు. దళితులను ముఖ్యమంత్రి చెయ్యాలని ఏ దళితుడూ అడగలేక పోతున్నారని, దళిత వ్యక్తిని తెలంగాణకు తొలి సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని షర్మిల విమర్శించారు.

Also Read:ఖమ్మం సభ: కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన షర్మిల

చేవెళ్ల - ప్రాణహితకి దివంగత వైఎస్సార్ అంబేద్కర్ పేరు పెట్టారని ఆమె గుర్తుచేశారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి అంబేద్కర్ పేరు పెట్టలేక పోతున్నారంటూ విమర్శించారు.

నాగార్జున సాగర్ ఎన్నికలకు కొవిడ్ నిబంధనలు అడ్డు రావని.. కానీ అంబేద్కర్ జయంతి ఘనంగా చేయడానికి మాత్రం నిబంధనలు అడ్డు వస్తాయా? అని షర్మిల ప్రశ్నించారు. దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్యపై ఒక ఆరోపణ రాగానే వెంటనే ఆయనను తొలగించారని, కానీ ఎన్నో ఆరోపణలు వస్తున్నప్పటికీ మంత్రి మల్లారెడ్డిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని షర్మిల విమర్శించారు.