Asianet News TeluguAsianet News Telugu

ఖమ్మం సభ: కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన షర్మిల

సీఎం కేసీఆర్‌పై షర్మిల విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్ట్‌ను రీడిజైనింగ్ పేరుతో మార్చేశారని ఆరోపించారు. కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేస్తానని వాగ్థానం చేశారని.. రైతుల పేరు మీద అప్పులు చేసి వారి జేబులు నింపుకుంటున్నారని షర్మిల మండిపడ్డారు

ys sharmila slams telangana cm kcr ksp
Author
Khammam, First Published Apr 9, 2021, 9:06 PM IST

ఉద్యమాల గుమ్మం.. ఖమ్మం అన్నారు వైఎస్ షర్మిల. ఖమ్మంలో జరుగుతున్న సంకల్ప సభలో ఆమె ప్రసంగించారు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఏప్రిల్ 9న చేవేళ్లలో వైఎస్సార్ పాదయాత్ర మొదలుపెట్టారని షర్మిల గుర్తుచేశారు.

ఎండలను లెక్కచేయకుండా వైఎస్ఆర్ పాదయాత్ర నిర్వహించారని.. రైతులకు, మహిళలకు, విద్యార్ధులకు భరోసానిస్తూ ప్రజాప్రస్థానం ప్రారంభించారని చెప్పారు. రాజన్న సంక్షేమ పాలన తిరిగి రావాలని సంకల్పిస్తున్నామని షర్మిల పేర్కొన్నారు.

ఇప్పుడు అదే రోజు ఖమ్మం గడ్డ నుంచి రాజకీయాల్లోకి వస్తున్నానని ఆమె ప్రకటించారు. రాజకీయ పార్టీ పెడుతున్నట్లు షర్మిల వెల్లడించారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని వైఎస్ఆర్ జలయజ్ఞం ప్రారంభించారని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై షర్మిల విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్ట్‌ను రీడిజైనింగ్ పేరుతో మార్చేశారని ఆరోపించారు. కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేస్తానని వాగ్థానం చేశారని.. రైతుల పేరు మీద అప్పులు చేసి వారి జేబులు నింపుకుంటున్నారని షర్మిల మండిపడ్డారు.

రాజన్న రాజ్యం అందించడానికే కొత్త పార్టీ పెడుతున్నట్లు ఆమె తెలిపారు. పాలక వర్గాన్ని నిలదీయడానికే పార్టీ పెడుతున్నామన్నారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్‌ను 38 వేల కోట్టలో వైఎస్సార్ సంకల్పిస్తే.. ఇప్పుడు రీడిజైనింగ్ చేసి ఏకంగా లక్షా 30 వేల కోట్లకు ప్రాజెక్ట్ ఖర్చును తీసుకెళ్లారని షర్మిల ఆరోపించారు.

65 లక్షల మంది రైతులను రాజన్న రుణ విముక్తులను చేశారని గుర్తుచేశారు. మహిళలు లక్షాధికారులు కావాలని వైఎస్ఆర్ కలలు కన్నారని.. వైఎస్ఆర్ పాలనలో వంద శాతం ఫీజు రీయంబర్స్‌మెంట్ వచ్చేదని షర్మిల తెలిపారు.

ఇప్పుడు 30 శాతం కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. మహిళలకు పావలా వడ్డీకే నాడు వైఎస్ఆర్ రుణాలిచ్చారని.. ఇప్పుడు సున్నా వడ్డీ అంటూనే 12.5 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

వైఎస్ఆర్ హయాంలో 11 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని షర్మిల చెప్పారు. పేదవాడికి తక్షణం వైద్యం అందించేందుకు 15 నిమిషాల్లో 108 వచ్చిందని గుర్తుచేశారు. వైఎస్ఆర్ జంబో డీఎస్సీ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేశారని షర్మిల తెలిపారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారని ఇచ్చారా.. అని ప్రశ్నించారు. ఐదేళ్లలో వైఎస్సార్ 46 లక్షల ఇళ్లు కట్టి చూపించారని షర్మిల తెలిపారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios