Asianet News TeluguAsianet News Telugu

వైఎస్‌ను తిడుతుంటే.. దద్దమ్మల్లా గాజులు తొడుక్కుని కూర్చొన్నారా: టీ. కాంగ్రెస్ నేతలపై షర్మిల ఫైర్

టీకాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల . వైఎస్ఆర్ అనే మూడు పదాలు ఉచ్చరించే హక్కు, అర్హత కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి లేదని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ఆర్ నిజమైన వారసులం తామేనని షర్మిల తేల్చి చెప్పారు. 
 

ys sharmila slams t congress leaders ksp
Author
hyderabad, First Published Jul 8, 2021, 7:12 PM IST

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిలబడి వుంది అంటే దానికి కారణం వైఎస్సార్ అన్నారు. భారాన్నంతా తన భుజాన వేసుకుని ఒక్కసారి కాదు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది వైఎస్సార్ అన్నారు. నాయకులు అని చెప్పుకుంటున్న ఎంతోమందిని రాజకీయ భిక్ష పెట్టిందే వైఎస్సార్ అని షర్మిల తెలిపారు. అలాంటిది రాజశేఖర్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ నేతలు దూషిస్తుంటే ఏమి చేతకాని దద్దమ్మల్లా, చేతులకు గాజులు తొడుక్కుని, చేతులు ముడుచుకుని కూర్చొన్నారంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైఎస్సాఆర్‌ పేరుని ఎఫ్ఐఆర్‌లో చేర్చింది ఈ కాంగ్రెస్ పార్టీయేనంటూ మండిపడ్డారు. వైఎస్ఆర్ అనే మూడు పదాలు ఉచ్చరించే హక్కు, అర్హత కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి లేదని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ఆర్ నిజమైన వారసులం తామేనని షర్మిల తేల్చి చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కేసీఆర్ అవినీతిపై తన దగ్గర ఆధారాలున్నాయని, వాటిని బయటపెడతామని చెబుతున్నారని మరి ఆధారాలుంటే అవి ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.

Also Read:కంట్లో కారం కొట్టి నోట్లో బెల్లం .. కేసీఆర్ పాలన అంతా గారడీయే: షర్మిల

వారిద్దరి మధ్య ఏదైనా డీల్ కుదిరిందా అని షర్మిల ఆరోపించారు. ఇద్దరూ తోడు దొంగలేనని.. మీకు ఏ డీల్ కుదరపోతే, ఆధారాలు ఎందుకు బయటపెట్టడం లేదని షర్మిల నిలదీశారు. తెలంగాణలో అవినీతిపై చర్యలు  తీసుకోవాల్సిన బాధ్యత బీజేపీకి లేదా అని ఆమె ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీ అయినా సరే వైఎస్‌ను కించపరిచేలా మాట్లాడితే కోట్లల్లో వున్న వైఎస్ఆర్ అభిమానులు వెంటపడి కొడతారని ఆమె మండిపడ్డారు. ప్రజలకు సేవ చేసేందుకు రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ వైఎస్సార్ ప్రాణాలు కోల్పోయారని షర్మిల గుర్తుచేశారు. ప్రజల సమస్యలపై కొట్లాడతామని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఆమె పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios