తెలంగాణలో తాము ఎవరిని ఢీకొంటున్నామో తనకు తెలుసునని వైఎస్సార్ కూతురు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న సోమవారంనాడు వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీలో చేరారు.
హైదరాబాదా్: తెలంగాణలో తాము ఎవరిని ఢీకొంటున్నామో తనకు తెలుసునని వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల అన్నారు. తాము కొండను ఢీకొంటున్నామని తనకు తెలుసునని ఆమె అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతికి గుండెలు పగిలి 700 మరణించారని ఆమె అన్నారు హైదరాబాదులోని లోటస్ పాండులో సోమవారం ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న నాయకత్వంలో షర్మిల పార్టీలో పెద్ద యెత్తున కళాకారులు చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సోమన్న ప్రతి మాటా ఓ తూటా అని ఆమె అన్నారు.
షర్మిల పెట్టబోయే పార్టీలో తొలుత సోమన్న చేరారు. ఏపూరి సోమన్న ఈ నెల 15వ తేదీన షర్మిల పెట్టబోయే పార్టీలో చేరుతున్నట్లు ముందుగానే ప్రకటించారు. సోమన్న కళాబృందం 2018 ఎన్నికల్లో కాంగ్రెసు తరఫున ప్రచారం సాగించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేరుకు సుధాకర్ కు మద్దతుగా నిలిచారు. అదే సమయంలో కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి పాదయాత్రలో కూడా పాల్గొన్నారు.
ఇదిలావుంటే, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన వైఎస్ షర్మిల తన పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉంది. వైఎస్సార్ టీపీగా తన పార్టీ పేరును షర్మిల నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాల సమన్వయానికి మండల స్థాయి వరకు షర్మిల కమిటీలను వేస్తున్నారు. మండలానికి ముగ్గురితో కమిటి వేయాలని, ఈ నెల 16వ తేదీకల్లా కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని ఆమె భావిస్తున్నారు.
కమిటీల బాధ్యతను తన ముఖ్య అనుచరుడు పిట్టా రాంరెడ్డికి, ఇటీవలే జట్టులో చేరిన ఇందిరా శోభన్ తదితరులకు అప్పగించారు. తొలుతు నియోజకవర్గ స్థాయిలో ముగ్గురు సభ్యులతో కమిటీ వేస్తారు. ఈ కమిటీలు మండల స్థాయి కమిటీలకు ఆ కమిటీలను పేర్లను ప్రతిపాదిస్తాయి. వాటిని పిట్టా రాంరెడ్డి తదితరులు పరిశీలించి ఖరారు చేస్తారు.
