తాను తెలంగాణలో రాజకీయాలు చేసే విషయంపై జగన్ తో చర్చించలేదని వైఎస్ షర్మిల అన్నారు. అదే సమయంలో తనకు జగన్ ఆశీస్సులు లేవని ఎందుకనుకుంటున్నారని ఎదురు ప్రశ్న వేశారు.

హైదరాబాద్: తాను తెలంగాణలో పార్టీ పెట్టే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తన సోదరుడు వైఎస్ జగన్ తో చర్చించలేదని వైఎస్ తనయ వైఎస్ షర్మిల చెప్పారు. పార్టీ పెట్టాలనే నిర్ణయం సాహసోపేతమైందని ఆమె అన్నారు జగన్, తన మధ్య అన్నాచెల్లెళ్ల అనుబంధం కొనసాగుతుందని షర్మిల చెప్పారు. రాజకీయంగా తన దారి తనదని, తాను తెలంగాణకు మాత్రమే పరిమితమవుతానని ఆమె చెప్పారు.

జగన్, తాను వేర్వేరు అని ఎందుకనుకుంటున్నారని ఆమె అడిగారు. జగన్ ఆశీస్సులు లేవని ఎందుకనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. తనకు జగన్ తోడబుట్టిన అన్న అని, ఆయన ఆశీస్సులు తనకు ఉన్నాయనే తాను అనుకుంటున్నానని షర్మిల అన్నారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని కొనసాగిస్తారా, కొత్త పార్టీ పెడుతారా అని ప్రశ్నిస్తే చూద్దామని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారా, మీరే చెప్పండని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజన్న రాజ్యం తేవాలనే కోరిక తనకు ఉందని ఆమె అన్నారు. రాజన్న రాజ్యం ఎలా తేవాలనే విషయంపైనే జిల్లాల నాయకులతో సమావేశం పెట్టినట్లు ఆమె తెలిపారు. 

పార్టీ ప్రకటన కన్నా ముందు జిల్లాల పర్యటనలు చేస్తానేమోనని ఆమె అన్నారు. రాజన్న రాజ్యం తేవాలని నల్లగొండ జిల్లా నాయకులు అంటున్నారని, అవకాశం కూడా ఉందని చెబుతున్నారని ఆమె అన్నారు. మీ సమావేశానికి జగన్ మద్దతు ఉందా అని అడిగితే లేదని ఎందుకనుకుంటున్నిారని అడిగారు. 

అయితే, షర్మిలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు జగన్ విషెస్ ఉంటాయని కూడా అన్నారు. అయితే, జగన్ తెలంగాణలో పార్టీ వద్దని జగన్ అన్నారని, కానీ షర్మిల తనంత తాను నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.