తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటులో షర్మిల అడుగులు వేగంగా పడుతున్నాయి. చాలా కసరత్తు చేస్తున్నారు. పార్టీ ప్రకటన తర్వాత రాజకీయ పోరాటం తప్ప ఇతర పనులేమీ పెండింగ్ లో ఉండకుండా చూసుకుంటున్నారు. 

ఈ మేరకే పార్టీకి ఇద్దరు సలహాదారులను నియమించారు. మాజీ ఐఏఎస్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఐపీఎస్‌ ఉదయ సిన్హాలు పార్టీ సలహాదారులుగా నియమితులయ్యారు. ఉదయ సిన్హా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సీఎస్ వోగా పనిచేశారు. ఇక ప్రభాకర్ రెడ్డి సీఎంవోలో అడిషనల్‌ సెక్రటరీగా పనిచేశారు. 

పార్టీ నిర్మాణం, పార్టీ ఏర్పాటు తర్వాత ఎట్ల ముందుకు పోవాలనే దానిమీద షర్మిల ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ విషయంలో షర్మిల తన సోదరుడు సీఎం జగన్ అడుగుజాడల్లో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అదెలా అంటే తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దగ్గర నమ్మకంగా పనిచేసిన వారినే ఎక్కువగా నమ్ముతున్నారు. 

షర్మిల తెలంగాణలో పెడుతున్న పార్టీలోకి వీరంతా రావడం వెనుక ఓ వ్యక్తి కీలకంగా ఉన్నట్టు సమాచారం. వైఎస్ హయాంలో చక్రం తిప్పిన ఓ నేతనే ఇతను అని తెలిసింది. 

ప్రతిరోజూ కొన్ని ఎంపిక చేసిన వర్గాలు షర్మిల ఇంటికి వచ్చేలా ఆ నేతనే ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. షర్మిల పార్టీ ఆఫీసుకు వచ్చే సమయానికి 50,60 మందికి తగ్గకుండా వివిధ జిల్లాల నుంచి విభిన్న వర్గాలకు చెందిన ఓ మాదిరి నేతలు లోటస్ పాండ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. 

వచ్చిన నేతలకు భరోసా ఇస్తూ.. షర్మిల పార్టీ ఆఫీసులోకి పంపుతున్నట్లు చెబుతున్నారు. షర్మిల పార్టీకి చాలా క్రేజ్ ఉందని చెప్పేందుకు రాజకీయాలతో సంబంధం లేని విభిన్న రంగాల్లోని ప్రముఖులైన వారిని షర్మిలతో భేటీకి ఆహ్వానిస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ షర్మిల పార్టీలో చేరారు. పార్టీ కార్యకర్తలను, నేతలను తన ఉత్తేజపూరిత ప్రసంగాలతో మోటివేట్ చేయనున్నట్లు చెబుతున్నారు. షర్మిలను మాల, మాదిగ సంఘాల నేతలు కలిశారు. ఇలా ప్రముఖులుగా మారి రాజకీయ ఆకాంక్షలు ఉన్నవారినే షర్మిల పార్టీ ప్రతినిధులు సంప్రదిస్తున్నట్లు చెబుతున్నారు.