నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, అలాగే నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో వైఎస్ షర్మిల చేసిన ఒకరోజు నిరాహారదీక్ష ముగిసింది. అనంతరం ఆమె అక్కడి నుంచి కాలినడకన లోటస్‌పాండ్ బయల్దేరారు

నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, అలాగే నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో వైఎస్ షర్మిల చేసిన ఒకరోజు నిరాహారదీక్ష ముగిసింది. అనంతరం ఆమె అక్కడి నుంచి కాలినడకన లోటస్‌పాండ్ బయల్దేరారు. తన నివాసం నుంచి షర్మిల దీక్షను కొనసాగించే అవకాశం వున్నట్లుగా తెలుస్తోంది.

అంతకుముందు ఉదయం వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులు అర్పించి.. నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం ఆమె దీక్షకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ, నిరుద్యోగులను సీఎం కేసీఆర్‌ పట్టించుకోవటం లేదంటూ విమర్శించారు.

Also Read:షర్మిల సభకు పోలీసుల అనుమతి: ఒక్క రోజే దీక్షకు పర్మిషన్

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని షర్మిల ధ్వజమెత్తారు. ఉద్యమాలు చేస్తే అణచివేస్తున్నారని.. నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మూడు రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగిస్తానని వైఎస్‌ షర్మిల వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మద్దతుగా ఎవరు మాట్లాడకపోయినా.. తాను అండగా ఉంటానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపట్టేదాక రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు, నిరసనలు కొనసాగుతాయని షర్మిల వెల్లడించారు.

ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంతో యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా.. సీఎం కేసీఆర్‌ పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ముందుండి పోరాటం చేసిన యువత కోసం వెంటనే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని దీక్ష స్థలి నుంచి ఆమె డిమాండ్‌ చేశారు.

కాగా, నిరుద్యోగుల సమస్యలపై మూడు రోజుల దీక్షకు అనుమతి ఇవ్వాలని షర్మిల పోలీసులను కోరారు. అయితే షర్మిల సభకు ఒక్క రోజే అనుమతి ఇచ్చారు పోలీసులు.ఈ నెల 9వ తేదీన ఖమ్మం లో నిర్వహించిన సభలో షర్మిల మూడు రోజుల పాటు హైద్రాబాద్ లో దీక్ష చేస్తానని ప్రకటించారు. అంతేకాదు ఈ మేరకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు.