టీఎస్‌పీఎస్‌సీ ఆఫీసుకి వెళ్లకుండా షర్మిల అడ్డగింత: లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత
వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం ముట్టడికి షర్మిల పిలుపునిచ్చింది. దీంతో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు.
హైదరాబాద్: వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు శుక్రవారంనాడు అడ్డుకున్నారు. హైద్రాబాద్ లోటస్ పాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. టీఎస్‌పీఎస్ సీ కార్యాలయానికి బయలుదేరిన షర్మిలను పోలీసులు నిలువరించారు. టీఎస్‌సీపీఎస్ చైర్మెన్ జనార్ధన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పిస్తానని ఆమె పోలీసులకు చెప్పారు. కానీ పోలీసులు ఆమెను అనుమతించలేదు. గేటు దాటి బయటకు వెళ్లకుండా పోలీసులు నిలువరించారు. పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. ఈ సఃందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాన్ని మాట్లాడకుండా ఎందుకు కట్టడి చేస్తున్నారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. పోలీసులు ఫ్రెండ్లీగా ఉండాలని ఆమె కోరారు.
ఈ నెల 12. 15.16 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది. ఈ నెల 5వ తేదీన జరిగిన ఏఈ పరీక్షలను రద్దు చేసింది. ఈ ప్రశ్నాపత్రం లీక్ కేసులో పోలీసులు ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసును విచారించేందుకు ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ప్రశ్నాపత్రం లీక్ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలు కీలకంగా వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసును టెక్నికల్ ఆధారాలతో విచారణ చేయాలని భావిస్తున్నారు. ప్రవీణ్ ఫోన్ ను పోలీసులు ఎఫ్ఎస్ఎల్ కు పంపారు.