హైదరాబాద్: కృష్ణా జలాలను శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తరలించుకుని వెళ్లడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచాలనే నిర్ణయం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. మంగళవారం ఆయన రాష్ట్ర జల వనరుల శాఖ సమీక్ష సమావేశంలో మాట్లాడిన తీరు ఆ విషయాన్ని తెలియజేస్తోంది. ఈ స్థితిలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు చిక్కులు తప్పేట్లు లేవు. 

ఆరు నెలల కిందటే జగన్ ప్రభుత్వం తన ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు జగన్ ఆరు నెలల కిందటే ప్రకటించారని, కేసీఆర్ ఇన్నాళ్లూ మౌనంగా ఎందుకు ఉన్నారని తెలంగాణలోని ప్రతిపక్షాలు అంటున్నాయి. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతూ ఆంధ్రప్రదేశ్ జారీ చేసిన జీవో విడుదలైన ఐదు రోజుల తర్వాత తెలంగాణ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. 

Also Read: కేసీఆర్, జగన్ మధ్య చిచ్చు: ఏమిటీ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు?

కృష్ణా నదీ జలాలను రాయలసీమకు తరలించాలనే జగన్ ప్రభుత్వ నిర్ణయం రహస్యంగా ఏమీ జరగలేదని అర్థమవుతోంది. జగన్ ప్రకటించిన తర్వాత కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పోతిరెడ్డిపాడు వివాదం జగన్, కేసీఆర్ మధ్య స్నేహానికి గండి కొట్టే పరిస్థితిని తెచ్చింది. 

పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచాలనే జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి. కాంగ్రెసు, బిజెపిలు ఇప్పటికే తమ ఆందోళన కార్యక్రమాలను ప్రకటించాయి. 

Also Read: నీటి యుద్ధం: కేసీఆర్ అభ్యంతరాలకు వైఎస్ జగన్ రిప్లై

ఆంధ్ర, తెలంగాణ సీఎంల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని బిజెపి తెలంగామ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఎపీ సీెఁ జగన్ తమ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే పనులు చేస్తుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం తెలంగాణ నాశనానికి తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. 

పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుకునే ఆలోచనను జగన్ కు కేసీఆర్ ఇచ్చారని అందుకే దానికి పరిపాలనాపరమైన ఆమోదం ఇచ్చినప్పుడు కేసీఆర్ నోరు మూసుకున్నారని బిజెపి నేత జి. వివేక్ అన్నారు. విమర్శలు రావడంతో ఇప్పుడు అడ్డుకుంటామని కల్లబొల్లి మాటలు చెబుతున్నారని ఆయన అన్నారు. జగన్ కు, కేసీఆర్ కు మధ్య కామన్ కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డి దోచుకోవాలనేది కుట్ర అని ఆయన అన్నారు. 

పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ మౌనం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాన్ని దెబ్బ తీస్తుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆయన అన్నారు. జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధాలను బయటపెడుతామని ఆయన అన్నారు.