అమరావతి: కృష్ణా నదిపై నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అభ్యంతరం చెప్పడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారుల సమావేశంలో జగన్ మంగళవారం కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని ఆయన చెప్పారు. 

మనకు కేటాయించిన నీటిని వాడుకోవడానికి పోతిరెడ్డిపాడు ఓక వెసులుబాటు మాత్రమేనని ఆయన అన్నారు. కృష్ణా బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటిని కేటాయిస్తుందని ఆయన చెప్పారు. ఎవరు కూడా బోర్డు కేటాయించిన పరిధిని దాటి వాడుకోవడానికి వీలు కాదని ఆయన అన్నారు. 

Also Read: జగన్ ప్రభుత్వంపై కేసీఆర్ గుర్రు: పోరు తప్పదని చెప్పిన సీఎం

రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగడానికి నీరు లభించడం లేదని, ఎవరైనా మానవతా దృక్పథంతో ఆలోచించాలని జగన్ అన్నారు. మనకు కేటాయించిన నీటిని పోతిరెడ్డిపాడుకు వాడుకుంటామని ఆయన చెప్పారు. శ్రీశైలం రిజర్వాయరులో నీటి మట్టం 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే రాయలసీమకు నీటిని తీసుకోవడానికి వీలుంటుందని, మొత్తం 44 క్యూసెక్కుల నీరు వాడుకోవడానికి వీలుంటుందని ఆయన చెప్పారు. 

ఆ స్థాయి నీటి మట్టం ఏడాదిలో కేవలం పది రోజులు ఉంటుందని, ఈ పది రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు వెళ్లాల్సి ఉంటుందని ఆయన చెప్పారు కొత్తగా నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టుకు గరిష్టంగా 9 క్యూసెక్కుల నీరు సరిపోతుందని ఆయన అన్నారు. కరువు పీడిత ప్రాంతాలకు నీరు తీసుకుని వెళ్తామంటే అభ్యంతరం చెప్పడం సరి కాదని ఆయన అన్నారు.