హైదరాబాద్: తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. వేయి రూపాయల కోసం ఓ యువకుడు తన మిత్రుడిని చంపి, శవాన్ని మూడు ముక్కలు చేసి డ్రమ్ములు పెట్టి పారేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలోని కస్లాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. 

నిందితుడు గంజేటి అంజయ్యను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. హత్య చేసిన తర్వాత అతను పారిపోయాడు. గంజేటి అంజయ్య, రాజు కలిసి తిరుగుతూ మద్యం సేవిస్తూ జల్సా చేసేవాళ్లు. అయితే, అంజయ్య తాను దిగుడులో పెట్టిన వేయి రూపాయలు కనిపించలేదు. దాంతో రాజును అడిగాడు. అయితే తాను తీయలేదని రాజు చెప్పాడు.

దాన్ని మనసులో పెట్టుకున్న అంజయ్య రాజును మూడు రోజుల తర్వాత తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. నిద్రిస్తున్న సమయంలో రాజును కర్రతో కొట్టి చంపాడు. ఆ తర్వాత శవాన్ని మూడు ముక్కలు చేసి డ్రమ్ములో పడేసి, మూడు చోట్ల పారేశాడు. పోలీసులు ఆ మూడు ముక్కలను జత చేసి స్థానికులకు చూపించారు. వారు అతన్ని గుర్తించారు. 

రాజు సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య నేరం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శవాన్ని తరలిస్తున్న సమయంలో అంజయ్య పర్సు పడిపోయింది. దాని ఆధారంగా అంజయ్య ఇంటికి వెళ్లగా ఇంట్లో రక్తం మరకలు కనిపించాయి. చివరకు అంజయ్య గురువారం పోలీసులకు చిక్కాడు. విచారణలో అంజయ్య తన నేరాన్ని అంగీకరించాడు.