నడిరోడ్డుపై ఓ వ్యక్తిని రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలోని రాజేందర్ నగర్ లో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే... రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధి పిల్లర్  నెంబర్ 260 ఎచ్‌ఎఫ్ ఫంక్షన్ హల్ ఎదురుగా నడిరోడ్డుపై ఒక వ్యక్తిని దుండగులు   వెంబడించి మరీ అతి దారుణంగా రాళ్లతో కొట్టి చంపారు. 

అందరూ చూస్తుండగానే.. పరిగెత్తించి మరీ.. రాళ్లతో కొట్టి కొట్టి చంపేశారు. గమనించిన స్థానికులు కూడా భయంతో వణికిపోయారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

సమాచారం అందిన వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. మృతుడు స్థానిక ఎంఐఎం నేత ఖలీల్‌గా గుర్తించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అపలు ఇంత దారుణంగా హత్య చేయడానికి కారణమేంటో తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.