హైదరాబాద్: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఓ యువకుడిని ఇంటికి పిలిపించి మరీ హత్య చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో స్నేహితుడు ఇంటికి పిలిపించి, కుటుంబ సభ్యులతో కలిసి గొడ్డలితో నరికి చంపాడు. ఈ విషయాన్ని అతను పోలీసులకు చెప్పాడు. 

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి కృష్ణయ్య కుమారుడు ఈర్లపల్లి కిరణ్ (28) డ్రైవర్ గా పనిచేస్తన్నాడు. గురువారం రాత్రి అదే గ్రామానికి చెందిన స్నేహితుడు ఏదుల మహేష్ కిరణ్ కు ఫోన్ చేసి ఇంటికి రావాల్సిందిగా కోరాడు. దాంతో ఆ రాత్రి 11 గంటల సమయంలో మహేష్ ఇంటికి వెళ్లాడు.

తన వదినతో వివాహేతర సంబంధం గురించి కిరణ్ ను మహేష్ నిలదీశాడు. దాంతో ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగింది. ఇంతలో అక్కడికి మహేష్ సోదరుడు, వదిన అక్కడికి వచ్చారు. దాంతో గొడవ మరింత ముదిరింది. ఈ గొడవలోనే మహిష్, అతని సోదరుడు శ్రీశైలం, వదిన రమాదేవితో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి కిరణ్ తలపై గొడ్డలితో బలంగా కొట్టారు. దాంతో కిరణ్ మరణించాడు. 

పథకం ప్రకారమే తన కుమారుడిని హత్య చేశారని కిరణ్ తండ్రి కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడిని మహేష్, శ్రీశైలం, రమాదేవి, కళమ్మ, లాలయ్య, సురేష్, మాసని రాజు హత్య చేశారని ఆనయ ఆరోపించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా కిరణ్ కుటుంబసభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. ఎసీపీ సురేందర్, సీఐ నర్సింహారెడ్డి మర్రిపల్లి గ్రామానికి చెర్కుని కిరణ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి హామీతో మృతదేహాన్ని తరలించడానికి అంగీకరించారు.