తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యూత్ కాంగ్రెస్ పిలుపు:ముందస్తు అరెస్టులు
విద్యార్ధి, నిరుద్యోగ సమస్యలపై తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: విద్యార్ధి, నిరుద్యోగ సమస్యలపై తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేడు పిలుపునిచ్చింది. ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ నేతలు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
నిరుద్యోగ భృతిపై ప్రకటన చేయాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది.ఈ విషయమై అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే యూత్ కాంగ్రెస్ అసెంబ్లీని ముట్టడించనున్నట్టుగా ప్రకటించింది. యూత్ కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.తెలంగాణ అసెంబ్లీ ముట్టడి కోసం ప్రయత్నించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పోలీసులు సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నిరుద్యోగులకు నిరుద్యోగభృతిని ఇస్తామని టీఆర్ఎస్ గతంలో ప్రకటించింది. అయితే ఈ హామీని అమలు చేయాలని టీఆర్ఎస్ సర్కార్ భావిస్తుంది.ఈ తరుణంలోనే కరోనా రావడంతో రాష్ట్ర ఖజానాపై ఆర్ధిక భారం పడింది. ఈ కారణాల నేపథ్యంలో నిరుద్యోగ భృతి అమలును వాయిదా వేశారు.నిరుద్యోగ భృతికి సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేయాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
నిరుద్యోగులకు ఉపాధి కల్పించే వరకు నిరుద్యోగభృతిని ఇస్తామని టీఆర్ఎస్ ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందని కాంగ్రెస్ ఆరోపించింది.