తాను చేయని తప్పుకి అతనిని నిందితుడిగా చేస్తూ అందరూ ఆరోపించేసరికి తట్టుకోలేకపోయాడు. బలవంతంగా తనువు చాలించాడు. 

మరో 20 రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కి సంతోషంగా జీవితాన్ని గడపాల్సిన యువకుడు.. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చేయని తప్పుకి అతనిని నిందితుడిగా చేస్తూ అందరూ ఆరోపించేసరికి తట్టుకోలేకపోయాడు. బలవంతంగా తనువు చాలించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...కొందుర్గు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కొందుర్గు మండలంలోని పర్వతాపూర్‌ గ్రామానికి చెందిన ఎడ్ల ప్రభాకర్‌(26) బీఈడీ పూర్తి చేసి వ్యవసాయం చేస్తున్నాడు. పెళ్లి కుదరడంతో ఈనెల 31న ముహూర్తం నిర్ణయించారు. అదే గ్రామానికి చెందిన ఓ యువతి గర్భవతి అయ్యిందన్న విషయం తెలుసుకున్న ఆమె కుటుంబసభ్యులు గురువారం ప్రభాకర్‌ను నిలదీశారు.

 ఆమె గర్భవతి కావడానికి ప్రభాకరే కారణమని నిందించి వాగ్వాదానికి దిగారు. తనకు ఏ పాపం తెలియదని ఎంత చెప్పినా వినలేదు. మనస్తాపం చెందిన ప్రభాకర్‌.. శుక్రవారం ఉదయం పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌, ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్సై రాంచంద్రయ్య చేరుకుని వివరాలు సేకరించారు.