నిజామాబాద్ : కన్నతల్లిపై అత్యాచారయత్నం... బిహారీ కూలీని కొట్టిచంపిన కొడుకులు
అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి ఒంటరిగా వున్న తల్లిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని ఇద్దరు యువకులు అతి దారుణంగా కొట్టిచంపారు. ఈ ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది.

నిజామాబాద్ : కన్నతల్లితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని ఇద్దరు సోదరులు దారుణంగా కొట్టిచంపిన ఘటన నిజామాబాద్ లో వెలుగుచూసింది. మహిళ ఒంటరిగా వుండగా అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇదే సమయంలో బయటకు వెళ్లిన ఆమె కొడుకులిద్దరు ఇంటికివచ్చి ఇది గమనించారు. వారి కోపం కట్టలుతెంచుకుని తల్లిపై అఘాయిత్యానికి యత్నించిన వ్యక్తిని పట్టుకుని చావబాదారు. తీవ్ర గాయాలపాలైన వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ పట్టణంలోని ఓ స్మశాన వాటికలో నాగుల ధశరథ్(27), మల్లేష్(21) కూలీలుగా పనిచేస్తున్నారు. గుర్బబడి ప్రాంతంలో మతిస్థిమితం సరిగ్గాలేని తల్లితో కలిసి ఇద్దరు సోదరులు నివాసముంటున్నారు. వీరి ఇంటికి సమీపంలోనే బిహార్ కు చెందిన వలసకూలీ అరుణ్ నివాముంటున్నాడు. ఇతడు మతిస్థిమితం లేని యువకుల తల్లిపై కన్నేసాడు.
గత శుక్రవారం రాత్రి సోదరులు దశరథ్, మల్లేష్ సినిమాకు వెళ్లగా తల్లి ఇంట్లో ఒంటరిగా వుంది. ఇది గమనించిన అరుణ్ ఇంట్లోకి చొరబడి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇదే సమయంలో ఇంటికి వచ్చిన సోదరులు తల్లితో అరుణ్ నీచంగా ప్రవర్తిస్తూ కనిపించాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన సోదరులు అరుణ్ ను పట్టుకుని విచక్షణారహితంగా చితకబాదారు.
గాయాలతో పడివున్న అరుణ్ ను ఓ ఆటో డ్రైవర్ గమనించి 108 అంబులెన్స్ కు సమాచారమిచ్చాడు. తీవ్ర గాయాలతో నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చేరిన హమాలీ కూలీ పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందాడు. దీంతో పోలీసులు సోదరులు మల్లేష్, దశరథ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
మృతుడు అరుణ్ ది బిహార్ రాష్ట్రంలోని సహర్స జిల్లా మక్కరి ప్రాంతంగా పోలీసులు గుర్తించారు.అతడి హత్యపై పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో హాస్పిటల్ కు చేరుకున్న కుటుంబసభ్యులు మృతదేహాన్ని బిహార్ తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.