భూమి తగాదాలతో సొంత తమ్ముడినే హత్య చేసేందుకు తెగబడ్డాడో అన్న. ఆస్తికోసం తోడ బుట్టిన తమ్ముడినే కర్రలతో కొట్టి చంపాడు. భూమికోసం రక్తసంబంధాన్ని సైతం లెక్కచేయని ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లాలోని నాంపల్లి మండలం, బండ తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని తాటిమీదిగూడెంలో చోటు చేసుకుంది. 

గ్రామంలోని బొదాసు కృష్ణయ్య తన తమ్ముడు బొదాసు వెంకటయ్య (55)కు ఎనిమిదేళ్ల క్రితం తొమ్మిదెకరాల భూమిని అమ్మేశాడు. ఆ తరువాత హైదరాబాద్‌కు వలసవెళ్లాడు. అయితే ఇటీవల కరోనా లాక్‌డౌన్‌ సమయంలో గ్రామానికి వచ్చిన కృష్ణయ్య ప్లేటు ఫిరాయించాడు. తాను తన తమ్ముడికి భూమిని అమ్మలేదని వాగ్వాదానికి దిగాడు. 

దీంతో వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి. కాగా వెంకటయ్య కుమారుడు భాస్కర్‌ వ్యవసాయ పనులు చేస్తుండగా బొదాసు కృష్ణయ్యతో పాటు అతని కుమారులు అక్కడకు వెళ్లి గొడవకు దిగి దాడికి యత్నించారు.

దీంతో భాస్కర్‌ గ్రామంలోకి పరుగులు తీశాడు. భాస్కర్‌ను వెంబడిస్తున్న విషయాన్ని తెలుసుకున్న అతని తండ్రి వెంకటయ్య తన అన్న, అన్న కొడుకులను అడ్డుకున్నాడు. దీంతో వారు వెంకటయ్యపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. 

తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో ఉన్న వెంకటయ్యను స్థానికులు 108 ద్వారా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందాడు. వెంకటయ్యకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.