జ్యోతినగర్‌: అవసరానికి ఆన్‌లైన్ లో అప్పు తీసుకున్న ఓ వ్యక్తి ఆ సంస్థ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. గడువు లోగా రుణం చెల్లించలేదన్న కారణంగా అప్పు ఇచ్చిన సంస్థ రుణ గ్రహీతపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో అతడు తట్టుకోలేకపోయారు. చివరకు వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించడంతో చివరకు లైవ్ లో వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో సంతోష్‌కుమార్‌ (36)అనే వ్యక్తి సైట్‌ ఇన్‌ఛార్జిగా పనిచేసేవాడు. ఎన్టీపీసీ మల్కాపూర్‌ శివారులో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అయితే ఇటీవల అతడికి డబ్బులు అవసరం వుండటంతో రుణం కోసం ఆన్ లైన్ యాప్ లను ఆశ్రయించాడు. ఆన్‌లైన్‌లో ఉదాన్‌లోన్‌ యాప్‌లో రూ.9319, రుఫిలో లోన్‌ యాప్‌లో రూ. 9197, రూపేలోన్‌ యాప్‌లో రూ.4230, ఎఎఎ-క్యాష్‌ లోన్‌ యాప్‌లో రూ.16660, లోన్‌గ్రాన్‌ యాప్‌లో 14770 అప్పుగా తీసుకున్నాడు.

read more   ఆన్‌లైన్ లోన్.. ఇలాంటి యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు: సజ్జనార్

అయితే ఇటీవల రుణయాప్‌ల నిర్వాహకులు వడ్డీ, అసలు చెల్లించాలని ప్రతిరోజు ఫోన్‌ చేసి వేధించసాగారు.  వారి బెదిరింపులు భరించలేక ఈ నెల 18న అద్దెకున్నఇంట్లోనే గడ్డి మందు తాగాడు. తన చరవాణిలో సెల్ఫీ వీడియో తీసుకొని ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడిని హాస్పిటల్ తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్సపొందుతూ అతడు ప్రాణాలు వదిలాడు.

మృతుడి కుటుంబసభ్యులు  ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంతోష్‌కుమార్‌ ఆత్మహత్యకు ప్రేరేపించిన ఉదాన్‌లోన్‌, రుఫిలో లోన్‌, రూపేలోన్‌, ఎఎఎ-క్యాష్‌ లోన్‌, లోన్‌ గ్రాన్‌ యాప్‌ల యాజమాన్యాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అతని స్నేహితుడు సుబ్రహ్మణ్యం ఎన్టీపీసీ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.  

వీడియో

ఈ ఆన్‌లైన్ అప్పుల సంస్థల వేధింపులు తట్టుకోలేక ఇటీవలే ఓ ప్రభుత్వ అధికారిణి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్ పేటకు చెందిన మౌనిక ఓ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తోంది. స్థానికంగా ఎగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. తన తండ్రి వ్యాపారంలో తీవ్రంగా నష్టపోవడం.. అప్పుల్లో నుంచి ఎలా భయటపడాలో తెలియకపోవడంతో ఆయనను అప్పుల బాధ నుంచి బయటపడేయాలని భావించింది. దీనిలో భాగంగా ఓ ఆన్ లైన్ సంస్థ నుంచి ఆమె రుణాన్ని తీసుకుంది.

అందులోనూ అధిక వడ్డీకి.. మరోవైపు కుటుంబ బాధ్యతలు తనపైనే పడ్డాయి. అప్పు అయితే దొరికింది కానీ, గడవులోగా తీర్చడమే ఆమెకు కష్టంగా మారింది. తీసుకున్న మొత్తంలో రూ.3 లక్షల అప్పును మౌనిక తీర్చలేకపోయింది. సదరు సంస్థ.. యువతి ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించింది. అదే సమయంలో యువతి ఫొటోపై డిఫాల్టర్ ముద్ర వేసింది. అక్కడితో ఆగకుండా ఫోన్‌లోని కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవాళ్లందరికీ వాట్సాప్ మెసేజ్‌లు పంపింది.

కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారందరికి ఆమె ఫొటోపై అప్పు ఎగ్గొట్టిందనే సమాచారంతో వాట్సాప్ మెసేజ్ పంపింది. మెసేజ్ వచ్చిన వారిలో బంధువులు, తన తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. దీంతో మౌనిక తీవ్ర మనస్తాపానికి గురైంది. ఎవరికీ మొహం చూపించలేక కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండిపోయింది. చివరికి పురుగుల ముందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మౌనిక చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు.