కాల్ మనీ లోన్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. క్రెడిట్ మనీ యాప్ విచారణలో వేగం పెంచారు తెలంగాణ పోలీసులు. మొత్తం 16 యాప్‌లపై సమాచారం సేకరించారు సీసీఎస్ పోలీసులు.

ఈ 16 యాప్‌ల కోసం పనిచేస్తున్న 4 కాల్ సెంటర్లు సీజ్ చేశారు. అలాగే యాప్స్ కోసం పనిచేస్తున్న 1100 మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. బేగంపేట్, పంజాగుట్టల్లోని మూడు కాల్ సెంటర్లపై దాడులు చేసిన సీసీఎస్ పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

వారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ మీడియాకు వివరించారు. భారతదేశం మొత్తం ఈ తరహా యాప్ వేధింపులు ఎక్కువయ్యాయని ఆయన చెప్పారు.

దీని వెనుక శరత్ చంద్ర అనే వ్యక్తి సూత్రధారిగా వున్నాడని చెప్పారు. ఈ తరహా యాప్స్‌‌‌‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దని, వీరి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా దగ్గరలోని పోలీసులకు ఫిర్యాదు చేయాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.