హైదరాబాద్: ప్రేమ పేరిట ఓ అమ్మాయిని వేధిస్తూ దాడికి పాల్పడటమే కాదు అసభ్య పదజాలంతో దూషించిన యువకున్ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అందరి ముందే లైంగికదాడికి పాల్పడతానంటూ బెదిరించడమే కాకుండా కుటుంబం మొత్తంపై దాడికి పాల్పడటంతో భయపడిపోయిన యువతి పోలీసులను ఆశ్రయించింది. 

వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ లో నివాసముండే ఓ యువతి ప్రైవేట్ కంపనీలో పనిచేస్తోంది. అయితే యువతి బయటకు వచ్చిన సమయంలో  గణేష్ అనే ఆకతాయి ప్రేమ పేరిట వెంటపడుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. అయినప్పటికి యువతి పట్టించుకోకపోవడంతో కోపం పెంచుకున్న గణేష్ దారుణంగా ప్రవర్తించాడు. 

read more   వదిన, మరిది అక్రమ సంబంధం.. కొడుక్కి విషయం తెలిసి..

యువతి పనిచేసే కంపనీకి వెళ్లి అందరిముందే ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమె సెల్ ఫోన్ పగులగొట్టాడు. ఇంతటితో ఆగకుండా ఆ తర్వాతి రోజే యువతి ఇంటికి వెళ్లి నానా హంగామా సృష్టించాడు. యువతితో పాటు కుటుంబ సభ్యులపై కూడా దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా తనను పెళ్లి చేసుకోకపోతే అసభ్యకరమైన పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. అందరిముందే లైంగిక దాడికి పాల్పడతానంటూ అసభ్యంగా దూషించాడు. 

ఈ ఘటనతో తీవ్ర మనోవేధనకు గురయిన యువతి కుటుంబం తమను కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించారు. వీరి ఫిర్యాదును స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.