అప్పిచ్చిన వ్యక్తి డబ్బులు కట్టమని ఒత్తిడి చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. దమ్మాయిగూడ లో తన ప్రియురాలితో కలిసి సహజీవనం చేస్తున్న మహమ్మద్ హనీఫ్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. అయితే తమ కుమారుడి ఆత్మహత్యకు ఫైనాన్సర్ తో పాటు ప్రియురాలు కూడా కారణమంటూ ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. కీసర మండలం నాగారం గ్రామానికి చెందిన మహమ్మద్‌ హనీఫ్‌ దమ్మాయిగూడలో పిల్లలకు ట్యూషన్‌ చెబుతుంటాడు. ఈ క్రమంలో ఇతడికి షాహిదా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారి దమ్మాయిగూడలో వారిద్దరూ సహజీవనం సాగిస్తున్నారు.

అయితే  కొద్దిరోజుల క్రితం మహమ్మద్ కి డబ్బులు అవసరం ఉండటంతో షాహిదాను అడిగాడు.ఆమె తనకు తెలిసిన వ్యక్తి వద్ద లక్షా నలభైవేల రూపాయలు అప్పుగా ఇప్పించింది. అయితే ఈ మద్య ఆ ఫైనాన్సర్ అప్పుతో పాటు వడ్డీ చెల్లించాలని షాహిదా ను డిమాండ్ చేశాడు. దీంతో ఆమె మహమ్మద్ ని అడగ్గా వారిద్దరి మద్య గొడవ జరిగింది.

ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి లోనైన మహమ్మద్ తన గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు గమనించిన షాహిదా పోలీసులకు సమాచారం అందించింది. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  
 మహ్మద్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు దు:ఖంలో మునిగిపోయారు. తమ కొడుకు చావుకి అప్పిచ్చిన వ్యక్తితో పాటు షాహిదా కూడా కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.