హైదరాబాద్: ఉద్యోగం కోసం ప్రయత్నించి విసిగిపోయిన ఓ యువకుడు మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా వున్న సమయంలో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కగానొక్క కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఆ తల్లిదండ్రులు తీరని వేదనను మిగిల్చింది.

వివరాల్లోకి వెళితే... రాజమండ్రికి చెందిన శేషగిరిరావు, అన్నపూర్ణమ్మ భార్యాభర్తలు. వారు ఉపాధి నిమిత్తం ఇటీవలే హైదరాబాద్ కు వచ్చి ఎల్లారెడ్డిగూడలో నివాసముంటున్నారు. వీరి ఒక్కగానొక్క కొడుకు మనోజ్ చౌదరి రాజమండ్రిలోనే బీటెక్ పూర్తిచేసి తల్లిదండ్రులతో కలిసి నగరానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. 

ఇలా ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. శనివారం రాత్రి ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో మనోజ్ ప్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పని ముగించుకుని ఇంటికివచ్చిన తల్లి కొడుకు ఉరేసుకున్న విషయాన్ని గుర్తించి చుట్టుపక్కల వారి సాయంతో కిందికి దించి హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. 

కొడుకు అకాల మృతి ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మహత్యకు నిరుద్యోగం ఒక్కటే కారణమా లేదా ఇంకా ఏవయినా కారణాలున్నాయా అన్నది తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.