Asianet News TeluguAsianet News Telugu

ఒక్క గుంట భూమి కూడా పోదు, రైతులకు ఇబ్బందైతే.. మాస్టర్ ప్లాన్ వెనక్కి : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతులు నిర్వహించిన ఆందోళనపై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ స్పందించారు. ఎమ్మెల్యేగా చెబుతున్నానని.. ఒక్క గుంట భూమి కూడా ఎక్కడికీ పోదని ఆయన హామీ ఇచ్చారు. రైతులను రెచ్చగొట్టి కొన్ని పార్టీలు పబ్బం గడుపుతున్నాయని సురేందర్ ఆరోపించారు.

yellareddy mla jajala surender response on farmers protest against kamareddy master plan
Author
First Published Jan 5, 2023, 9:40 PM IST

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతులు నిర్వహించిన ఆందోళన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ స్పందించారు. అవసరమైతే మాస్టర్ ప్లాన్ వెనక్కి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రైతులను రెచ్చగొట్టి కొన్ని పార్టీలు పబ్బం గడుపుతున్నాయని ఆయన ఆరోపించారు. భూమి పోతుందని రైతుల్ని ప్రతిపక్షాలు భయపెడుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. జనవరి 11 వరకు తమ అభ్యంతరాలు తెలపవచ్చని... రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని సురేందర్ పేర్కొన్నారు. అవసరమైతే మాస్టర్ ప్లాన్ వెనక్కి తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. రైతులతో చర్చించి ముసాయిదాను రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందని సురేందర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా చెబుతున్నానని.. ఒక్క గుంట భూమి కూడా ఎక్కడికీ పోదని ఆయన హామీ ఇచ్చారు. రైతులకు ఇబ్బంది తలెత్తినట్లయితే.. ఇండస్ట్రియల్ జోన్ రద్దు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చానని సురేందర్ గుర్తుచేశారు. 

ఇకపోతే.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ ఉదయం నుంచి ఆందోళన నిర్వహించిన రైతులు ఇవాళ్టీకి శాంతించారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన విరమించిన రైతులు .. రేపు కామారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. కలెక్టర్ దిష్టి బొమ్మకు వినతి పత్రం ఇచ్చి అనంతరం దిష్టి బొమ్మను తగులబెట్టారు. ఇవాళ్టీకి ఆందోళన విరమిస్తున్నట్లు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తెలిపింది. 

Also REad: ఆందోళన విరమించిన రైతులు : కలెక్టర్ దిష్టిబొమ్మకు వినతిపత్రం, ఆపై దగ్థం.. రేపు కామారెడ్డి బంద్‌కు పిలుపు

కాగా.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను నిరసిస్తూ రైతులు కొన్ని గంటలుగా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక దశలో గేట్లు ధ్వంసం చేసి లోపలికి వెళ్లేందుకు అన్నదాతలు ప్రయత్నించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు రైతులను బుజ్జగించేందుకు జిల్లా ఎస్సీ శ్రీనివాస్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. వారితో చర్చలు జరిపిన ఆయన.. గాంధేయ మార్గంలో ఆందోళన చేయాలని హితవు పలికారు. 

మాస్టర్ ప్లాన్ ముసాయిదా ఇంకా ఆమోదం పొందలేదని.. రైతుల తరపున ఐదుగురు వస్తే కలెక్టర్‌తో చర్చలు జరిపిస్తామని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రైతులపై తమకు ఎలాంటి కోపం లేదని.. కలెక్టర్ రైతుల దగ్గరకు రారని, రైతులే కలెక్టర్ వద్దకు వెళ్లాలని ఎస్పీ కోరారు. అయితే రైతులు మాత్రం పట్టువీడటం లేదు. కలెక్టరే తమకు దగ్గరికి వస్తే ఆందోళన విరమిస్తామని తేల్చిచెబుతున్నారు. మరోవైపు కలెక్టర్ జితేష్ పాటిల్ మాత్రం తన ఛాంబర్‌లోనే వున్నారు.

Also REad: కామారెడ్డి : రంగంలోకి ఎస్పీ, లోనికి ఐదుగురికే అనుమతి.. కలెక్టర్ రావాల్సిందేనంటూ రైతుల పట్టు

అయితే రైతుల ఆందోళన తీవ్రరూపు దాల్చడానికి కలెక్టర్ జితేష్ పటేల్ మొండివైఖరే కారణమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రైతులతో మాట్లాడకూడదనే పంతంతో కలెక్టర్ వున్నారు. రైతుల ముట్టడితో కలెక్టరేట్ హోరెత్తుతున్నా విషయాన్ని పోలీసులకే వదిలేశారు కలెక్టర్. రైతు ఆత్మహత్య చేసుకున్నా స్పందించకపోవడంతో ఆయనపై అన్నదాతలు భగ్గుమంటున్నారు. కలెక్టర్ వచ్చి తమతో మాట్లాడేదాకా ఆందోళన విరమించేది లేదని రైతులు తేల్చిచెబుతున్నారు. కలెక్టర్ వచ్చి తమ నుంచి వినతిపత్రం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios