Asianet News TeluguAsianet News Telugu

ఆ బియ్యం కొనకుంటే మీ ఇళ్లముందే ధర్నా..: బిజెపి నాయకులకు మంత్రి గంగుల వార్నింగ్ (వీడియో)

యాసంగిలో వరి సాగు, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికార టీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని బియ్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు. 

yasangi grain purchase issue... minister gangula kamalakar warning to bjp leaders
Author
Karimnagar, First Published Nov 11, 2021, 1:05 PM IST

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత కారణాలను వెతుక్కుని మరీ టీఆర్ఎస్, బిజెపిలు కయ్యానికి దిగుతున్నాయి. పెట్రోల్, డిజిల్ తో ప్రారంభమైన మాటలయుద్దం యాసంగిలో వరిసాగు, ధాన్యం కొనుగోలుపై కొనసాగుతోంది. తాజాగా ఇరుపార్టీలు ఒకరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరొకరు ధర్నాలకు సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పౌరసరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ బిజెపి నాయకులు, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

''BJP నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. వానాకాలం పంట కొనమని ఎవరు ఆన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజ కొంటామని చెప్పింది... తప్పకుండా కొంటాం. TRS Government కొంటామంటున్నా కొనాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయడం బీజేపీకే చెల్లింది. వానాకాలం పంట ఎక్కడ కొనుగోలు జరగకున్నా స్వయంగా నేను వెళ్లి కొనుగోలు చేపిస్తా'' అని gangula kamalakar స్పష్టం చేసారు. 

వీడియో

''గతంలో రాష్ట్రవ్యాప్తంగా 6వేల పైచిలుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టాము. కానీ ఈసారి అంతకంటే ఎక్కువగా 6663 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాము. ఇప్పటికి 3500 కొనుగోలు కేంద్రాలలో  ధాన్యం కొనుగోల్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 5లక్షల 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాము. 1000 కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొన్నాము'' అని మంత్రి వివరించారు. 

read more  పార్లమెంట్ సమావేశాలు ఎలా జరుగుతాయో చూస్తాం..: కేంద్ర సర్కారుకు తలసాని హెచ్చరిక (వీడియో)

''బండి సంజయ్, కిషన్ రెడ్డి లు రాష్ట్రంలో ధర్నా చేయడం కాదు... ఢిల్లీలో యాసంగి పంట కొనుగోలు కోసం ధర్నా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి మిల్లు పట్టిస్తాము... ఆ తర్వాత బియ్యాన్ని ఎఫ్ సి ఐ ద్వారా కొనేలా బిజెపి వాళ్ళు చేయాలి. బియ్యం కొనకుంటే మీ ఇళ్ల ముందు ధర్నా చేస్తాం'' అని గంగుల హెచ్చరించారు. 

''ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 75 వేల రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసింది. బిజెపి అబద్ధాలు చెపుతుంది అనడానికి ఇదే నిదర్శనం. టిఆర్ఎస్ ధర్నా చేయబోతుంది కాబట్టి కౌంటర్ గా ఈరోజు ధర్నా చేపట్టింది బిజెపి. వానాకాలం పండించిన  ప్రతి గింజ కొంటామని రైతులకు చెబుతున్నాం. అయినా బీజేపీ నాయకులు ధర్నాకు చేస్తామంటున్నారు. ఓ రోజు టిఆర్ఎస్, మరో రోజు బిజెపి ధర్నాలు చేస్తే రైతులు ఆందోళనకు గురవుతున్నారు'' అన్నారు. 

''యాసంగి పంట విషయంలో మీరే బాధ్యత తీసుకుని కొనండి. బియ్యం రూపంలో పంటను కొనాల్సిన అవసరం కేంద్రానిదే. డాక్యుమెంటరీల్లో కొనం అంటారు... ఇక్కడ కొంటున్నాము అంటున్నారు. యాసంగి పంట కోనము అని ఈటల రాజేందర్ అంటడు. బండి సంజయ్ కొంటాము అంటారు. ఇలాంటి బిజెపి నాయకులను రైతులు నమ్మవద్దని కోరుతున్నా'' అన్నారు. 

read more  కేసీఆర్‌ను టచ్ చేస్తే మాడి మసైపోతారు: బండి సంజయ్‌కి మోత్కుపల్లి వార్నింగ్

''కడుపు మంటతోనే బిజెపి ఈరోజు ధర్నాకు దిగింది. బీజెపి వాళ్ళు ధర్నా అంటే రైతులకు సంఘీభావంగా మాకు మద్దతు ఇస్తారనుకున్నా... కానీ వాళ్ళు వానాకాలం పంట విషయంలో ధర్నా చేస్తున్నారని తెలిసింది. అయితే కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ప్రకారమే ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయి. కొనుగోలు లేట్ అవ్వడానికి మేము బాద్యులం కాదు. బిజెపివి జూటా మాటలు నమ్మొద్దు'' అని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. 

  

Follow Us:
Download App:
  • android
  • ios