మంత్రి తలసాని మీద యాదవుల ఫైర్

First Published 6, Dec 2017, 5:52 PM IST
Yadavs upped the ante on minister talasani Srinivasa yadav
Highlights
  • కుటంబం పేరు మీద తప్పుడు ట్రస్ట్ నడుపుతున్నడు
  • యాదవుల అభివృద్ధి నిరోధకుడు అయిండు

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై యాదవ కులస్తులు సీరియస్ అయ్యారు. సీరియస్ అవడమే కాదు.. ఏకంగా ఆయన మీద తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, హరీష్ రావు లకు ఫిర్యాదు కూడా చేశారు. సొంత కులానికి చెందిన మంత్రి అయినప్పటికీ తలసాని చేస్తున్న దందాల కారణంగా కులానికే చెడ్డపేరు వస్తోందని యాదవ కులస్తులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అఖిల భారత యాదవ మహాసభ ప్రతినిధులు బుధవారం మంత్రి హరీష్ రావును కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఒక వినతిపత్రం సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ తప్పుడు ట్రస్ట్ సృష్టించి యాదవులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. తలసాని సృష్టించిన యాదవ్ ఫ్యామిలీ ట్రస్ట్ పై వారు ఫిర్యాదు చేశారు.

దీంతోపాటు యాదవుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రకటించిన పది ఎకరాల భూమిని త్వరలో కేటాయించాలని మరో వినతిపత్రం అందించారు .మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక బూటకపు యాదవ్ ఫామిలీ ట్రస్ట్  సృష్టించి యాదవుల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదవ కుల బాంధవుల ఫిర్యాదుపై హరీష్ రావు స్పందించారు. తక్షణమే తప్పుడు ట్రస్ట్ పై విచారణ జరిపిస్తానని ఆల్ ఇండియా యాదవ్ మహాసభ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని యాదవ నేతలు మీడియాకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర నాయకులు బాబూరావు యాదవ్, సి. అశోక్ కుమార్ యాదవ్, బేరి రాంచందర్ యాదవ్, లక్ష్మి నర్సయ్య యాదవ్, సునంద యాదవ్, రాజేందర్ యాదవ్, యాదయ్య యాదవ్, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

loader