బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేపై వేధింపుల ఆరోపణలు చేసిన నవ్య తాజాగా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. 

హన్మకొండ : మాజీ డిప్యూటీ సీఎం, అధికాకపార్టీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మహిళా సర్పంచ్ నవ్య మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తుంటే సర్పంచ్ నవ్య ఆరోపిస్తుంటే... అదంతా తప్పుడు ప్రచారమేనని రాజయ్య అంటున్నారు. ఇలా కొంతకాలంగా మహిళా సర్పంచ్, ఎమ్మెల్యే మధ్య సాగుతున్న వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 

నవ్య సర్పంచ్ గా వున్న జానకీపురం గ్రామానికి రూ.25కోట్ల నిధులు మంజూరుచేసారు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య. ఈ నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్ లెటర్ ను ఎమ్మెల్యే విడుదల చేసారు. ఈ లేఖ తనకు అందడంతో సర్పంచ్ నవ్య భావోద్వేగానికి లోనయి కంటతడి పెట్టుకున్నారు. గ్రామాభివృద్దికోసం ఎమ్మెల్యే నిధులు విడుదల చేయడం ఆనందంగా వుందని... ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని నవ్య అన్నారు. 

అయితే ఎమ్మెల్యే రాజయ్యపై తన పోరాటం కొనసాగుతుందని నవ్య స్పష్టం చేసారు. రాజకీయాలు వేరు... వ్యక్తిగత జీవితం వేరు... తనను ఎమ్మెల్యే రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా వేధించారని ఆమె తెలిపారు. కాబట్టి నిజాయితీగా ఆయన వేధింపుల గురించి బయటపెట్టానని... మహిళా కమీషన్ కు ఆధారాలు అందిస్తానని తెలిపారు.

Read More ఎమ్మెల్యే రాజయ్య నుండి ప్రాణహాని... పోలీస్ ప్రొటెక్షన్ కావాలి : సర్పంచ్ నవ్య సంచలనం

ఇటీవల జానకీపురం గ్రామానికి వచ్చిన రాజయ్య అభివృద్ది పనులకోసం నిధులు అందిస్తానని హామీ ఇచ్చారని... ఈ మేరకు తాజాగా నిధులు మంజూరు చేసారని నవ్య తెలిపారు. ఈ రూ.25 లక్షల నిధులు గ్రామాభివృద్దికి ఖర్చు చేస్తామని సర్పంచ్ తెలిపారు. అలాగే తన భర్త ప్రవీణ్ ఎమ్మెల్యే రాజయ్య వద్ద తీసుకున్న రూ.7లక్షలు తిరిగి ఇచ్చేస్తామని నవ్య వెల్లడించారు. 

ఇదిలావుంటే గత రెండేళ్లుగా ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని సర్పంచ్ కురుసపల్లి నవ్య ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక ఎమ్మెల్యేకు దూరంగా వుంటున్నామని... దీంతో తమ గ్రామానికి నిధులు ఇవ్వడంలేదని అన్నారు. తమ పిల్లల పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్యను కలిసామని...తండ్రిలాంటి మీరే ఇలా చేయడం తగదు అని చెప్పామన్నారు నవ్య. అయినా ఎమ్మెల్యే ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీకే చెందిన ఓ మహిళ నాయకురాలు తనను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారని సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేసారు.