సారాంశం

బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తున్న జానకీపురం సర్పంచ్ తాజాగా తనకు ప్రాణహాని వుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

హన్మకొండ : అధికార బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళా సర్పంచ్ నవ్య ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తనపై జరుగుతున్న వేధింపుల  గురించి బయటపెట్టినందుకు ఎమ్మెల్యేతో పాటు మరికొందరు నాయకులు కక్షగట్టారని... చంపేందుకు కూడా ప్రయత్నిస్తున్నారంటూ మహిళా సర్పంచ్ ఆందోళన వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే రాజయ్య, ఎంపిపి కవితతో తనకు ప్రాణహాని వుందని... పోలీసులు రక్షణ కల్పించాలని సర్పంచ్ నవ్య కోరారు. 

ఇక ఇప్పటికే ఎమ్మెల్యే రాజయ్యతో పాటు ఆయనకు సహకరిస్తూ తనను వేధిస్తున్నవారిపైనా జానకీపురం సర్పంచ్ నవ్య పోలీసులకు ఫిర్యాదు చేసారు. తాను కేవలం ఆరోపణలు మాత్రమే చేయడం లేదని... వేధింపులకు సంబంధించిన ఆదారాలు కూడా వున్నాయని నవ్య స్పష్టం చేసింది. ఇప్పటికే తనపై జరుగుతున్న వేధింపులకు సంబంధించిన ఆడియోలు బయటపెట్టారు నవ్య. సరైన ఆధారాలతో ఇవాళ(బుధవారం) రాష్ట్ర మహిళా కమీషన్ ను కలుస్తానని నవ్య తెలిపారు. 

తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వుస్తున్నాయని... గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని సర్పంచ్ నవ్య తెలిపారు. డబ్బులిస్తా... తనతో వస్తావా అంటూ ఒకడు చాలా అసభ్యకరంగా మాట్లాడిన వీడియోను నవ్య బయటపెట్టారు. మీ అమ్మను, అక్కాచెల్లిని అలాగే డబ్బులిచ్చి వేరేవాళ్ల దగ్గరకు పంపిస్తున్నావా అంటూ ఫోన్ చేసి వేధిస్తున్నవాడికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు నవ్య. 

Read More  శారీరకంగా వాడుకుని ప్రభుత్వోద్యోగం రాగానే వదిలేస్తాడట..: ప్రియుడి ఇంటిముందు యువతి ధర్నా (వీడియో)

తాను ఏ తప్పూ చేయలేదు... తనతో తప్పుగా వ్యవహరించిన వారిపై పోరాటం చేస్తున్నానని నవ్య అన్నారు. నిజాయితీగా పోరాడుతున్న తాను ఎవరికీ భయపడబోనని... న్యాయం కోసం ఎక్కడివరకైనా వెళ్లడానికి సిద్దమని అన్నారు. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే రాజయ్య ఎందుకు స్పందించడం లేదని నవ్య ప్రశ్నించారు. 

అధికార పార్టీకి చెందిన నాయకురాలిని, మహిళా సర్పంచ్ ను... తన పరిస్థితే ఇలా వుంటే సామాన్య మహిళలకు రక్షణ పరిస్థితి ఏంటంటూ నవ్య ఆందోళన వ్యక్తం చేసారు. ప్రజలను బిడ్డల్లా చూసుకోవాల్సిన ఎమ్మెల్యే ఓ మహిళా ప్రజాప్రతినిధితో అసభ్యంగా ప్రవర్తించడం దారుణమన్నారు. అవసరం అయినపుడు ఎమ్మెల్యే రాజయ్య వేధింపులకు సంబంధించిన అన్ని ఆధారాలను బయటపెడతానని జానకీపురం సర్పంచ్ నవ్య వెల్లడించారు.