డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇలా కూడా తప్పించుకోవచ్చా..?

women high drama.. escape from police drunk and drive test
Highlights

పోలీసులను ఏమార్చిన యువతులు.. హైడ్రామా నడిపించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కినట్టే  చిక్కి.. సులభంగా ఎలా తప్పించుకోవాలో ఈ అమ్మాయిలను చూసి నేర్చుకోవచ్చు. పోలీసులను ఏమార్చి ఇద్దరు యువతులు హైడ్రామా నడిపించారు. అసలు మ్యాటరేంటంటే... శనివారం రాత్రి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45లో నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌లో హైడ్రామా నడిచింది. మద్యం తాగి వాహనం నడుపుతున్న వారిని పోలీసులు పరీక్షిస్తుండగానే.. వారికి దూరంగా ఓ ఖరీదైన కారు ఆగింది.

 డ్రైవింగ్‌ సీట్లో కూర్చుంది నల్ల టీ షర్టు ధరించిన యువతి అని మాత్రం పోలీసులు గుర్తించారు. అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లగా వాహనం డ్రైవింగ్‌ సీట్లో ఎవరూ కనిపించలేదు. కొద్దిసేపటికి ఏటీఎంలో నుంచి ఇద్దరు యువతులు బయటకు వచ్చారు. అప్పటికే లోపల వారు తమ దుస్తులను పరస్పరం మార్చుకున్నారు. నల్ల టీషర్టు ధరించిన యువతి తన టీషర్టును స్నేహితురాలికి ఇచ్చేసి ఆమె దుస్తులను ధరించింది. 

వాస్తవానికి నల్ల టీషర్టు ధరించిన యువతి పీకలదాకా మద్యం తాగింది. కాగా నడిరోడ్డుపైన వాహనాన్ని ఎందుకు ఆపారని సదరు యువతులను పోలీసులు ప్రశ్నిస్తుండగానే.. ఆ కారు తనదంటూ ఓ యువకుడు అక్కడికి వచ్చాడు. అతడికి బ్రీత్‌ అనలైజర్‌ పరీక్ష నిర్వహించగా బీఏసీ జీరో వచ్చింది. ఏటీఎంలో దుస్తులు మార్చుకుంటుండగానే తమ స్నేహితుడికి వారు ఫోన్‌ చేసి అక్కడికి పిలిపించుకొని ఉంటారని స్థానికులు అంటున్నారు. 

ఇంత జరిగినా..నో పార్కింగ్‌ ఏరియాలో కారును ఆపినందుకుగాను కొద్దిపాటి జరిమానాతో వారు తప్పించుకున్నారు. అక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే.. యువతుల నాటకం బయటపడేదని స్థానికులు గుసగుసలాడుకున్నారు. కాగా ఈ ఘటనపై అక్కడ విధులు నిర్వహించిన ట్రాఫిక్‌ సీఐ కావేటి శ్రీనివాసులు స్పందించారు. వాహనాలను డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తికి మాత్రమే డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తామని ఆ సమయంలో కారులో డ్రైవింగ్‌ సీట్లో తమకు ఎవరూ కనిపించలేదన్నారు.

loader