ఓ వ్యక్తి మృతికి కారణమనే అనుమానంతో మహిళ మెడలో చెప్పుల దండ వేసి అవమానించిన ఘోరమైన ఘటన మహబూబాబాద్ లో చోటు చేసుకుంది. 

మహబూబాబాద్ : తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. ఓ మహిళను మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఆమె కారణంగా ఓ వ్యక్తి మరణించాడని ఇలాంటి అనాగరిక చర్యకి పాల్పడ్డారు. సమీప బంధువులే ఇలాంటి ఆకృత్యానికి పాల్పడి ఘోరంగా అవమానించారు. ఈ దారుణమైన ఘటన సోమవారంనాడు మహబూబ్నగర్ జిల్లా డోర్నకల్ శివారు తండాలో జరిగింది. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితుల వివరాల్లోకి వెడితే… ఈ నెల 10న పట్టణ పరిధిలోని మున్నేరువాగు దగ్గర్లోని శివాలయం దగ్గర ఓ మృతదేహం దొరికింది. ఇది కుళ్ళిపోయిన స్థితిలో ఉంది.

దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహానికి ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాథమిక విచారణలో మృతుడు డోర్నకల్ శివార్లలో ఉండే తండాకు చెందిన వ్యక్తి అని గుర్తించారు. ఇదే క్రమంలో ఆ వ్యక్తి మృతికి తండాకు చెందిన ఓ మహిళ కారణమని సమీప బంధువులు ఆరోపించారు. ఆమె మీద అందరూ కలిసి దాడి చేశారు. మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఈ విషయం మీద డోర్నకల్ సీఐ వెంకటరత్నం మాట్లాడుతూ.. మహిళను అవమానపరిచిన విషయం తమ దృష్టికి రాలేదని అన్నారు. కాగా, కుళ్ళిన మృతదేహాన్ని గుర్తించే కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

హైద్రాబాద్‌లో కొత్తగా 13 పోలీస్ స్టేషన్లు: ఈ నెలాఖరు నుండే కార్యకలాపాలు

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో గతంలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. తన కూతురుతో స్నేహం చేస్తున్నారని ఓ 20 యేళ్ల యువకుడిని, అతని స్నేహితుడిని యువతి తండ్రి దారుణంగా కొట్టి, అరగుండు గీయించి, చెప్పుల దండలు వేసి అవమానించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో జరిగింది. 

ఈ దారుణమైన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో యువతి తండ్రి, మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మే 22న జరిగిన ఈ ఘటన మీద ఓ దళిత యువకుడు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని ఎస్సీ / ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేశారు. 

ఫిర్యాదు దారుడు రాజ్ కుమార్ డెహారియా చెప్పిన వివరాల ప్రకారం.. అతను గ్రామంలోని ఓబిసీ సామాజిక వర్గానికి చెందిన పలుకుబడి గల కుటుంబానికి చెందిన 19 ఏళ్ల యువతితో స్నేహం చేస్తున్నాడు. అయితే ఆ యువతి తనను ఇంట్లో బంధించారని, బైటికి వెళ్లనివ్వడం లేదని, కమ్యూనికేట్ చేయడానికి ఫోన్ కూడా లేదని తెలపడంతో.. అతను తన స్నేహితుడి ఫోన్ ను కొద్దిరోజుల కోసం అప్పుగా తీసుకుని ఆమెకు ఇచ్చాడు. 

ఫోన్ విషయం యువతి తండ్రికి తెలియడంతో.. యువతి బంధువులు రాజ్ కుమార్ డెహారియా, అతని స్నేహితుడిని ఇంటికి తీసుకొచ్చారు. ఆ తరువాత తన కూతురితో చనువుగా ఉంటావా అంటూ దాడి చేసి, అరగుండు గీయించారు. అంతటితో ఆగకుండా మెడలో బూట్ల దండలు వేశారు. ఈ విషయం పోలీసులకు చెబితే తమ కుటుంబాలకు హాని చేస్తామని నిందితులు బెదిరించారని ఇద్దరు యువకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

"ఈ మేరకు కేసు నమోదైంది. యాదవ వర్గానికి చెందిన అమ్మాయికి దళిత వర్గానికి చెందిన రాజ్‌కుమార్ డెహారియా మొబైల్ ఫోన్ ఇచ్చాడు. ఈ విషయం కుటుంబంలో తెలియడంతో గొడవ మొదలయ్ియంది. వారు ఆ యువకుడిని కొట్టారు. మే 27 న మాకు సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకున్నాం. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు సమర్పించాం. కోర్టు వారిని రిమాండ్‌కు తరలించింది ”అని సీనియర్ పోలీసు అధికారి రవి చౌహాన్ తెలిపారు.