రంగారెడ్డి జిల్లాలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని చేవెళ్ల జెడ్పీటిసి చింపుల శైలజాసత్యనారాయణరెడ్డి తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో కలవరం రేపుతున్నది. అధికార టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆమె అంతగా తీసుకున్న నిర్ణయం ఏంటబ్బా అనుకుంటున్నారా? అయితే చదవండి స్టోరీ.

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల జెడ్పీటిసి చింపులశైలజాసత్యనారాయణరెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. నాలుగేళ్ల క్రితం ఆమె టిఆర్ఎస్ పార్టీలో జెడ్పీటిసిగా గెలిచారు. అయితే ఇప్పటికీ గెలిచి నాలుగేళ్లు అవుతున్నా.. అధికార పార్టీలోనే ఉన్నా.. మాట ఇచ్చిన ప్రకారం ప్రజలకు సేవ చేయలేకపోతున్నానన్న తపనతో రగిలిపోతున్నారు. మరో ఏడాదిలో తన పదవీ కాలం అయిపోతున్న వేళ ప్రజలకు మొహం చూపుకోలేకపోతున్నానని ఆమె బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు సొంత ఆస్తి అమ్మకానికి పెట్టి సంచలనం సృష్టించారు. ఎన్నికల సమయంలో చేవెళ్ల మండలంలోని గ్రామాల్లో చేస్తానన్న అభివృద్ధి పనులు చేయలేకపోవడంతో ఆమె తన సొంత ప్లాట్ అమ్మకానికి పెట్టారు శైలజ. చేవెళ్ల మండల కేంద్రంలో హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లే హైవే పక్కన ఉన్న తన భూమిని అమ్మకానికి పెట్టారు. అంతేకాదు.. ఈ భూమి అమ్మకం కోసం పెట్టిన ఫ్లెక్సీలో కీలకమైన కామెంట్స్ రాశారు. తెలంగాణ సర్కారు గ్రామాలకు నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి చేయలేకపోతున్నమని.. అందుకే తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం తన ప్లాట్ అమ్మకానికి పెట్టినట్లు ఫ్లెక్సీలో రాశారు. ఈ ప్లాట్ ను ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

2014 లో జరిగిన జెడ్పీ ఎన్నికల్లో శైలజా సత్యనారాయణరెడ్డి టిఆర్ఎస్ తరుపున పోటీ చేసి చేవెళ్ల జెడ్పీటిసి గా గెలుపొందారు. అప్పటినుంచి అధికార పార్టీలో ఉంటూనే స్థానిక సంస్థలకు నిధుల కోసం ఫైట్ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కు సీనరేజి నిధులు ఇవ్వడంలో సర్కారు నిర్లక్ష్య వైఖరిపై గట్టిగానే పోరాటం చేశారు. అయితే సర్కారు పట్టించుకోకపోవడంతో హైకోర్టులో సీనరేజీ నిధులు ఇప్పించాలని కేసు వేసి సర్కారుపై గెలిచారు. జిల్లాకు 540 కోట్ల నిధులు రెండు నెలల్లోనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయినా ఏడాది గడుస్తున్నా.. సర్కారు నిధుల విడుదల చేయలేదు. ఆ నిధులు విడుదలైతే.. గ్రామానికి 60, 70 లక్షలు మంజూరయ్యే అవకాశం ఉందని ఆమె అంటున్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో ఆమె ఆగ్రహంగా ఉన్నారు. మరో ఏడాది కాలంలోనే తాను ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు హైవే పక్కన తనకున్న ప్లాట్ అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందని ఆమె చెబుతున్నారు. ఆ స్థలం అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో రైతులు పొలాలకు వెళ్లే రోడ్లను బాగు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెబుతున్నారు.

అధికార టిఆర్ఎస్ పార్టీ మాటలు తప్ప చేతల్లో ఏమాత్రం స్థానిక ప్రజా ప్రతినిధులను గౌరవించడంలేదని ఆమె ఆరోపిస్తున్నారు. నిధుల విడుదల చేయకపోవడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఏమీ చేయలేక కుమిలిపోతున్నారని అంటున్నారు. సర్కారు వైఖరి నచ్చక ఆమె ఇటీవల కాలంలో టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినట్లు చెబుతున్నారు. తాను, తన భర్త చింపుల సత్యనారాయణరెడ్డి ఏ పార్టీలో ఉన్నా.. ప్రజలకు, రైతులకు సేవ చేయడమే తమ లక్ష్యమని ఆమె ఏషియానెట్ కు తెలిపారు.