ఆ దంపతులకు పెళ్లై దాదాపు 12 సంవత్సరాలు అవుతోంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. ఆ దంపతుల మధ్య ఏనాడు సఖ్యత లేదు. ఈ క్రమంలో భర్తతో గొడవ పడి... భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో.. ఈ దంపతులు దాదాపుగా సంవత్సర నుంచి దూరంగా ఉంటున్నారు. ఇటీవల భర్త తల్లి చనిపోయింది. ఆ సమయంలో.. ఇంటికి వచ్చిన భార్య.. ఇంట్లోని బంగారం, వెండి ఆభరణాలన్నింటినీ దోచుకొని వెళ్లిపోయింది.

భార్య వచ్చి బంగారం తీసుకెళ్లిన విషయం తెలియని అమాయకపు భర్త.. దొంగలు పడ్డారనుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి విచారణలో అసలు విషయం బయటకు తెలియడంతో అందరూ షాకయ్యారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన పాన్ బ్రోకర్ శివప్రకాశ్ ధారక్ భార్య అర్చన.. సంవత్సరకాలంగా దూరంగా ఉంటున్నారు. అర్చన తన ముగ్గురు పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటుంది. అదే జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన బత్తుల వెంకట కృష్ణ ప్రసాద్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఏప్రిల్ లో తన అత్త చనిపోవడంతో కారేపల్లికి వచ్చింది.

భర్తను వదిలేసి ప్రియుడితో కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్న ఆమె.. అత్త ఇంట్లోని బంగారం, డబ్బు మొత్తం తీసుకొని వెళ్లిపోయింది. ఈనెల 3న ప్రియుడిని కారేపల్లికి పిలిపించుకుంది. లాకర్‌లో ఉన్న ఆభరణాలను అపహరించింది. వాటిని ప్రియుడు కృష్ణ ప్రసాద్‌కు ఇచ్చి నగదు గా మార్చాలని, తర్వాత తాను వస్తానని చెప్పి పంపించేసింది.  అది తెలియని  భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా.. సొమ్ము మొత్తం భార్య దగ్గరే ఉండటాన్ని గుర్తించారు.మొత్తం రూ.63లక్షలు విలువచేసే సొత్తు కావడం గమనార్హం. నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.