ఆమె ఓ ఎమ్మెన్సీలో ఉద్యోగిని.. వస్తున్న శాలరీతో సంతృప్తి కలగలేదో.. ఇంకా డబ్బు సంపాదించాలనుకుందో.. ఇక్కడ యువతలో గంజాయి మీదున్న క్రేజ్ చూసిందో.. కానీ మొత్తానికి గంజాయి వ్యాపారంలోకి దిగింది. మూడేళ్లుగా సాగిస్తూ తాజాగా పట్టుబడింది. 

హైదరాబాద్ : యువకులు, ఐటీ నిపుణుల్లో ganjaకి ఉన్న డిమాండ్ ను సొమ్ము చేసుకునేందుకు araku నుంచి సరకు తీసుకొచ్చి మల్కాజిగిరి, నాచారం, మేడ్చల్, పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో విక్రయిస్తున్న ఐటీ ఉద్యోగిని కొండపనేని మాన్సిని బోయిన్పల్లి పోలీసులు గురువారం మేడ్చల్ జిల్లా కొంపల్లిలో అరెస్టు చేశారు. నాచారంలో ఉంటూ ఓ ఎంఎన్సీ(ఐటీ) లో పనిచేస్తున్న మాన్సీ, భర్త మదన్ మనేకర్ తో కలిసి రెండేళ్లుగా గంజాయి అమ్ముతోంది. మార్చి12న ఈ దంపతులు మరో ఇద్దరు యువకులతో కలిసి గంజాయి అమ్ముతుండగా బోయిన్పల్లి పోలీసులు పట్టుకునేందుకు వెళ్లారు. 

1.2 కిలోల గంజాయితో యువకులుఇద్దరూ పట్టుబడగా, దంపతులు పారిపోయారు. వారు ఇచ్చిన సమాచారంతో గాలిస్తుండగా కొంపల్లి వద్ద గురువారం మాన్సీని పట్టుకున్నారు. ఏపీకి చెందిన ఆమె పూర్వీకులు నాగపూర్ జిల్లాలో వ్యవసాయంలో స్థిరపడ్డారు. భోపాల్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం చేసేందుకు హైదరాబాద్కు వచ్చింది. నాచారంలో మూడేళ్లుగా భర్తతో కలిసి ఉంటుందని ఏసిపి నరేష్ రెడ్డి తెలిపారు.

ఇదిలా ఉండగా, Jubileehills పరిధిలో తయారుచేసి, విక్రయిస్తూ పట్టబడిన శ్రీరామ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. Suryapeta జిల్లాకు చెందిన శ్రీరామ్ బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చాడు. చదువుకునే రోజుల్లోనే మత్తు పదార్థాలకు అలవాటు పడిన అతను… ఉద్యోగం లేక చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. చివరికి తానే మత్తు మందు తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం Social mediaల్లో, ఇంటర్నెట్ లో సెర్చ్ చేశాడు. హిమాలయాలు, రిషికేశ్ తదితర ప్రాంతాలకు వెళ్లి విదేశీ పర్యాటకుల నుంచి డీఎంటీ తయారీ విధానం తెలుసుకున్నాడు.

అందుకు కావాల్సిన ముడిసరుకును కొన్ని ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా కొనుగోలు చేశాడు. మరికొన్ని రసాయనాల కోసం ఎవరికీ అనుమానం రాకుండా దుకాణాల వద్దకు ఒక కెమిస్ట్రీ విద్యార్థిలాగా వెళ్లి ప్రాక్టికల్స్ కోసం అవసరం అని చెప్పి కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో కొండాపూర్ లో ఉంటున్న తన ఇంటినే ల్యాబ్ గా మార్చేశాడు. దాదాపు రెండేళ్లపాటు ప్రయోగాలు చేసి ఎట్టకేలకు మత్తు మందు తయారీలో సక్సెస్ అయ్యాడు. తొలుత తనతోపాటు స్నేహితులపై పరీక్షించి అవి పనిచేస్తున్నాయని నిర్ధారణకు వచ్చాడు. ఒక గ్రాముతో 20 మందికి కిక్ ఇస్తుందని స్వయంగా తెలుసుకున్నాడు. ఆ మత్తు పదార్థాన్ని సేవించేందుకు ప్రత్యేక పరికరాలను కూడా సేకరించి విక్రయించడం ప్రారంభించాడు.

తాను తయారుచేసిన డ్రగ్ ఆవిరి రూపంలో ఓ పరికరం నుంచి సేవించాలని వినియోగదారులకు తెలిపాడు. ఇతనికి పరిచయమైన... సాఫ్ట్వేర్ కంపెనీలో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న దీపక్ కు కూడా విక్రయించాడు. క్రమంగా డిమాండ్ పెరగడంతో.. ఒక గ్రామ్ రూ.8 వేల చొప్పున విక్రయించడం మొదలుపెట్టాడు. డ్రగ్స్ విక్రయిస్తున్న క్రమంలో శ్రీరామ్ తో పాటు దీపక్ అనే వినియోగదారుడిని నార్కోటిక్ విభాగం అరెస్టు చేసింది. వీరు నుంచి ఎనిమిది గ్రాముల డీఎంటీ డ్రగ్, తయారీ పరికరాలు, రెండు మొబైల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామ్ ను అరెస్టు చేసిన తర్వాత అతని ఇంటిని పరిశీలించిన పోలీసులు అక్కడ ఏర్పాటు చేసిన ల్యాబ్, అందులో ఉన్న పరికరాలను చూసి అవాక్కయ్యారు.