హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను బిల్డింగ్‌పై నుంచి తోసేసి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది.

హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను బిల్డింగ్‌ పైనుంచి తోసేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. ఓ మహిళ డబుల్ బెడ్‌రూమ్ బిల్డింగ్ 8వ అంతస్తు నుంచి తన కూతురు, కొడుకును కిందకు తోసేసింది. ఆ తర్వాత ఆమె కూడా బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను సౌందర్య, ఆమె పిల్లలు నిత్య, నిదరీష్‌గా గుర్తించారు. అయితే కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అదనపు కట్నం కోసం భర్త నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నట్టుగా చెబుతున్నారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ఈ ఘటనతో సౌందర్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సౌందర్య ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె భర్త, అత్త వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు.

(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)