హైదరాబాద్‌లో దారుణం.. మహిళకు లిఫ్ట్ ఇచ్చి కారులోనే అత్యాచారం
హైదరాబాద్‌లో ఓ యువతి రోడ్డు పై నడుస్తూ వెళ్లుతుండగా కారులో లిఫ్ట్ ఇస్తానని ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని మధురానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. వర్షంలో రోడ్డు పై నడుచుకుంటూ వెళ్లుతున్న ఓ మహిళ పై దుండగుడు కన్నేశాడు. కారులో లిఫ్ట్ ఇచ్చి అదే కారులో అత్యాచారం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మధురానగర్ పరిధిలో చోటుచేసుకుంది.
మధురానగర్‌లో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లుతుండగా.. ఓ కారు అటు వైపుగా వచ్చింది. ఆమె లిఫ్ట్ అడగకున్నా.. ఆ డ్రైవర్ కారు ఆపి లిఫ్ట్ ఆఫర్ చేశాడు. ఏం అక్కర్లేదని ఆమె చెప్పినా.. భరోసాగా మాట్లాడి ఆమెను కన్విన్స్ చేశాడు. భయపడకండీ.. వర్షం ఎక్కువగా పడుతున్నదని, ఇలాగే వెళ్లితే తడిసిపోతావని ఆ దుండగుడు ఆమెను నమ్మబలికాడు. దీంతో ఆ మహిళ కారు డ్రైవర్‌ను విశ్వసించింది.
Also Read: కేసీఆర్ ఇలాకాలో అమానుషం... దళిత యువకుడిపై కర్రలతో నలుగురి దాడి
అనంతరం, ఆమె కారులో వెనుక సీటులో కూర్చోవడానికి ఆమె వెళ్లింది. కానీ, డ్రైవర్ వారించాడు. వెనుక సీటులో వద్దని, ముందు సీటులో కూర్చోవాలని సూచించాడు. అయితే, ఆ కారును ఆమె అనుకున్న దారిలో కాకుండా మరో మార్గానికి మళ్లించాడు. దీంతో ఆ మహిళ అనుమానంతో డ్రైవర్‌ను అడిగింది. సమాధానం ఇవ్వలేదు డ్రైవర్. దీంతో అనుమానంతో ఆ మహిళ అరుపులు వేసింది. అరిస్తే చంపేస్తానని ఆ డ్రైవర్ బెదిరించాడు. ఆ తర్వాత ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి కారులో నుంచి బయటికి తోసేశాడు. ఆమె దయనీయ స్థితిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.