హైదరాబాద్ సనత్‌నగర్‌లో మహిళా లోకో పైలట్ కనిపించకుండా పోయిన ఘటన కలకలం సృష్టిస్తోంది. పెళ్లికి సంబంధించిన షాపింగ్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లినా ఆమె తిరిగి రాలేదు.

హైదరాబాద్ సనత్‌నగర్‌లో మహిళా లోకో పైలట్ కనిపించకుండా పోయిన ఘటన కలకలం సృష్టిస్తోంది. పెళ్లికి సంబంధించిన షాపింగ్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లినా ఆమె తిరిగి రాలేదు. 50 రోజులు గడిచిన ఆమె ఆచూకీ ఇంకా దొరకలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.. వాసవి అనే మహిళ సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌లో లోకో పైల‌ట్‌గా విధులు నిర్వ‌ర్తిస్తుంది. స‌న‌త్‌న‌గ‌ర్‌లో ఓ అద్దె గ‌దిలో ఉంటుంది. అయితే నవంబ‌ర్ 30వ తేదీ సాయంత్రం తన గది నుంచి బయటకు వెళ్లింది. 

ఆ రోజు వాసవికి ఆమె తండ్రి భాస్క‌ర్ రావు ఫోన్ చేయగా.. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఇంటి య‌జ‌మానికి ఫోన్ చేశాడు. అయితే సాయంత్రం స‌మ‌యంలో బ‌య‌ట‌కు వెళ్తున్నాన‌ని చెప్పి వెళ్లిపోయింద‌ని వారు తెలిపారు. అయితే ఆ తర్వాత వాసవి సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు, గాడ్జెట్స్ అన్ని గదిలోనే వదిలేసి వెళ్లినట్టుగా గుర్తించారు. ఈ ఘటనపై సనత్ నగర్ పోలీసులకు భాస్క‌ర్ రావు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, వాసవికి పెళ్లి కుదిరిందని.. డిసెంబర్‌లో పెళ్లి ముహుర్తం కూడా నిర్ణయించారు. ఈ క్రమంలోనే వాసవి అదృశ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.