మద్యపానం కారణంగా ఎన్నో కుటుంబాలు చితికిపోయాయి. ఈ మద్యం మత్తులో చాలా మంది చాలా దారుణాలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. విపరీతంగా మందు తాగి వచ్చి భార్య, ఇతర కుటుంబసభ్యులను వేధించిన భర్తలు ఉన్నారు. అదే మత్తులో భార్యలను  చంపిన భర్తలు కూడా ఉన్నారు. ఇలాంటి వార్తలు మనం చాలానే చూశాం. అయితే.. ఇది మాత్రం రివర్స్. మద్యం మత్తులో ఓ మహిళ కట్టుకున్న భర్తను చంపేసింది. ఈ సంఘటన రాజేంద్రనగర్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మద్యం మత్తులో భర్తను కత్తితో పొడిచి చంపిదో భార్య. రాజేంద్రనగర్‌ బండ్లగూడలో ఈ ఘటన జరిగింది. విశాల్‌ దివాన్‌ (43), సబీనా రోషన్‌ (50) భార్యాభర్తలు. ఇద్దరూ విశ్రాంత మిలటరీ ఉద్యోగులు. సబీనాకు ఇది రెండో వివాహం. మొదటి భర్త చనిపోవడంతో 2007లో విశాల్‌ను ఆమె పెళ్లాడారు. నెల క్రితం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. మళ్లీ  శనివారం రాత్రి ఇద్దరూ గొడవపడ్డారు. అప్పటికే తాగిన మత్తులో ఉన్న సబీనా కూరగాయలు కోసే కత్తితో విశాల్‌ను పొడిచింది. ఇది చూసిన కూతురు బోస్‌ పక్కింటి వారి సాయంతో విశాల్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందారని వైద్యులు నిర్ధారించారు.