జనగామ: తండ్రీ, కొడుకుతో కలిసి భర్తను చంపి... సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చిపెట్టిన మహిళ
అత్తవారింట్లోనే అల్లుడు అతి దారుణంగా హత్యకు గురయిన ఘటన జనగామ జిల్లాలో వెలుగుచూసింది.
జనగామ : తండ్రితో కలిసి కట్టుకున్న భర్తనే అతి దారుణంగా హతమార్చిందో మహిళ. మృతుడి కొడుకు కూడా ఈ హత్య సహకరించాడు. ఇలా భార్య, కొడుకు, మామ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. అత్తవారింట్లోనే అల్లుడు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన జనగామ జిల్లాలో చోటుకుంది.
పోలీసులు, స్థానికులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా దేవరుప్పల మండలం కామారెడ్డిగూడ గ్రామానికి చెందిన శైలజ, నాగరాజు భార్యాభర్తలు. అత్తామామలకు ముగ్గురు కూతుర్లే వుండటంతో ఓ కూతురు భర్త నాగరాజును ఇల్లరికం తెచ్చుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు సంతానం.
అయితే మద్యానికి బానిసైన నాగరాజు భార్యతో తరచూ గొడవపడేవాడు. ఇలా గత సోమవారం రాత్రి కూడా ఫుల్లుగా మందుకొట్టి ఇంటికివచ్చిన నాగరాజు భార్యతో గొడవకు దిగాడు. ఆమెను కొడుతూ రక్తస్రావం అయ్యేలా చేతిని కొరికాడు. కూతురు రక్తం చూసి కోపంతో ఊగిపోయిన తండ్రి అబ్బసాయిలు అల్లుడితో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే అల్లుడి మెడలోని కండువాను పట్టుకుని గొంతుకు బిగించడంతో ఊపిరాడక మృతిచెందాడు.
Read More బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్ధి ఆత్మహత్య.. మూడు నెలల వ్యవధిలో ముగ్గురు బలవన్మరణం
నాగరాజు చనిపోవడంతో భార్య శైలజ, మామ అబ్బసాయిలుతో పాటు చిన్నకొడుకు తేజ కంగారుపడిపోయారు. ఈ విషయం బయటపడకుండా మృతదేహాన్ని మాయం చేయాలని అనుకున్నారు. ముగ్గురు కలిసి నాగరాజు మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ వేసి పూడ్చిపెట్టారు. ఆ మర్నాడు ఉదయం ఏమీ జరగనట్లుగా ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు.
అయితే రాత్రి స్నేహితుడి ఇంటివద్ద వున్న పెద్దకొడుకు కిరణ్ మంగళవారం ఉదయం ఇంటికి వచ్చాడు. ఇంట్లో తండ్రి కనిపించకపోవడం... రక్తంతో తడిసిన దుస్తులు కనిపించడంతో అతడికి అనుమానం వచ్చింది. దీంతో ఆరాతీయగా కుటుంబసభ్యులే తండ్రిని చంపి సెప్టిక్ ట్యాంక్ లో పూడ్చిపెట్టినట్లు తెలిసింది. ఇలా హత్యోదంతం బయటపడటంతో మృతుడి భార్య శైలజ, మామ అబ్బసాయిలు, చిన్నకొడుకు తేజ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.