సిద్ధిపేట జిల్లాలో (siddipet district) దారుణం జరిగింది. భర్త వేధింపులు తాళలేక.. భార్య తన బిడ్డకు నిప్పంటించింది తానూ ఆత్మహత్య చేసుకుంది. కొండపాక మండలం (kondapaka mandal ) సిర్సనగండ్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది

సిద్ధిపేట జిల్లాలో (siddipet district) దారుణం జరిగింది. భర్త వేధింపులు తాళలేక.. భార్య తన బిడ్డకు నిప్పంటించింది తానూ ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కొండపాక మండలం (kondapaka mandal ) సిర్సనగండ్ల గ్రామానికి చెందిన స్వామి అనే వ్యక్తికి చేర్యాల మండలం వేచరేణికి దిన పోశయ్య, మల్లవ్వల చిన్న కుమార్తె నవితతో 10 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి మణిదీప్(2) అనే కుమారుడు ఉన్నాడు. స్వామి వ్యవసాయ పనులతో పాటు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కొన్నాళ్లుగా స్వామికి భార్య నవిత ప్రవర్తనపై అనుమానం కలిగింది. నవితకు తన సోదరుడితో వివాహేతర సంబంధం ఉందనే కారణంతో ఆమెను వేధించసాగాడు. ఈ విషయమై భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. విషయం పెద్దల దాకా వెళ్లడంతో వారు పంచాయతీ పెట్టించి నచ్చజెప్పారు.

ALso Read:దారుణం: భార్యాభర్తల మధ్య గొడవలు... ఇద్దరు పిల్లలకి ఉరేసి, తల్లి ఆత్మహత్య

ఈ నేపథ్యంలో శనివారం పొద్దున్న పొలంలో పత్తిని ఏరెందుకు రావాల్సిందిగా స్వామి భార్యను కోరాడు. అయితే దీనికి ఆమె ససేమిరా అనడంతో మరోసారి ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన స్వామి భార్యపై చేయి చేసుకుని వ్యవసాయ బావి వద్దకు వెళ్లిపోయాడు. భర్త కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నవిత మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమారుడు మణిదీప్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి తానుకూడా అంటించుకుంది. ఇంట్లోంచి పొగలు రావటం గమనించిన స్థానికులు తలుపులు పగల గొట్టి చూడగా చిన్నారితో సహా తల్లి విగతజీవులై కనిపించారు. దీంతో నవిత తల్లిదండ్రులు గ్రామానికి చేరుకున్నారు. తమ కూతురిపై లేనిపోని అభాండాలు వేసి వేధించి చంపారని వారు ఆరోపించారు. తమ బిడ్డ మృతికి అత్త బీరవ్వ, బావ భాస్కర్, భర్త స్వామిలే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.