పూర్వకాలంలో పెద్దలు విధించిన ఓ ఆచారం.. మహిళ ప్రాణం  పోవడానికి కారణమైంది. ఆ ఆచారం కారణంగా మహిళ పాముకాటుకు బలవ్వాల్సి వచ్చింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం ధరమడుగు గ్రామంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మావల మండలంలోని వాఘాపూర్‌కు చెందిన సునీత (22)కు మండలంలోని ధరమడుగుకు చెందిన ఆత్రం సంతోష్‌తో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి రెండేళ్ల కిందట బాబు పుట్టగా.. అనారోగ్య సమస్యలతో కొన్నిరోజులకే మృతిచెందాడు.


మళ్లీ సంతానం కోసం నిష్టతో పెద్దలు చెప్పినట్లుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు రుతుక్రమం వచ్చింది. వీరి ఆచారం ప్రకారం రుతుక్రమం వచ్చిన మహిళ ఇంటి బయటే ఉండాలి. దీంతో సునీత సోమవారం రాత్రి ఇంటి బయట నేలపై పడుకోగా.. రాత్రి 11 గంటల సమయంలో పాము కాటేసింది.

ఆమె బాధతో మూలగడంతో.. పక్కనే మంచంపై పడుకున్న భర్త సంతోష్‌ వెంటనే ఆమెను రిమ్స్‌కు తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ సునీత ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.