గద్వాల: ఆర్టీసీ బస్సులోనే ఓ మహిళ ప్రసవించిన ఘటన జోగుళాంబ గద్వాలలో చోటు చేసుకొంది. బస్సులోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు.గద్వాల జిల్లాలోని గట్టు మండలంలోని ఆరేగిద్ద గ్రామానికి చెందిన గోపాలమ్మ బుధవారం నాడు ఆర్టీసీ బస్సులోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

also read:గద్వాల గర్భిణి మృతి: క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించిన హైకోర్టు

ఆసుపత్రిలో చికిత్స కోసం గోపాలమ్మ ఆర్టీసీ బస్సులో ఆరేగిద్ద నుండి గట్టు ప్రాథమిక ఆసుపత్రికి బుధవారం నాడు బయలుదేరింది.  ఆమె బస్సులో ఉన్న సమయంలోనే నొప్పులు ఎక్కువయ్యాయి. ఆమె నొప్పులు భరించలేకపోయింది..

మహిళ బాధను తెలుసుకొన్న బస్సు డ్రైవర్ గట్టు ప్రాథమిక కేంద్రానికి త్వరగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ, మార్గమధ్యలోనే ఆమె డెలీవరీ అయింది. ఆసుపత్రికి చేరుకొనేలోపుగానే తోటి మహిళా ప్రయాణీకుల సహాయంతో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.

నొప్పులు ఎక్కువ రావడంతో తోటి మహిళా ప్రయాణీకులే ఆమెకు సహాయం చేశారు. వారి సహాయంతోనే బస్సులోనే గోపాలమ్మ డెలీవరీ అయింది.  మగ పిల్లాడికి ఆమె జన్మనిచ్చింది. 

దీంతో అదే బస్సులో గట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆమెను తరలించారు. గట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాధితురాలికి చికిత్స అందించారు. తల్లీ బిడ్డలు క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.