కట్టుకున్న భర్తతో పాటు అత్తింటివారి వేధింపులు భరించలేక కన్న బిడ్డలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.
మేడ్చల్: నమమాసాలు కడుపున మోసి కనడమే కాదు కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచుకున్న కన్న బిడ్డలతో కలిసి కన్నతల్లి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు సిద్దమైన మహిళ తాను లేకపోతే పిల్లలను చూసుకునేవారు వుండరని మదనపడింది. అలాగని భర్తతో సహా అత్తింటివారి వేధింపులు భరిస్తూ బ్రతకలేకపోయింది. దీంతో కన్న బిడ్డలతో చెరువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణం హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... మేడ్చల్ జిల్లా రాజబొల్లారం గ్రామానికి చెందిన శివరాణి-భిక్షపతి భార్యాభర్తలు. వీరికి జగదీష్, దీక్షిత్, ప్రణీత సంతానం. భార్యాపిల్లలతో ఆనందంగా జీవించాల్సింది పోయి భిక్షపతి నిత్యం భార్యను వేధించేవాడు. అతడితో పాటు అత్త రాములమ్మ కూడా శివరాణిపై వేధించేది. ఇలా కట్టుకున్న భర్త, అత్త ఎంత వేధించినా పిల్లల కోసం ఇంతకాలం భరిస్తూ వచ్చింది. కానీ ఇటీవల ఈ వేధింపులు మరీ మితిమీరిపోవడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. దీంతో దారుణ నిర్ణయం తీసుకుంది.
తాను ఆత్మహత్య చేసుకుంటే పిల్లల ఆలనాపాలనా చూసేవారు వుండరని భావించిన శివరాణి వారి ప్రాణాలు తీసేందుకు సిద్దపడింది. గత బుధవారం గ్రామ శివారులోని చెరువువద్దకు ముగ్గురు పిల్లలతో కలిసి వెళ్లిన ఆమె చిరకొంగుకు వారిని కట్టుకుని చెరువులో దూకింది. అయితే పెద్ద కుమారుడు జగదీష్ ఎలాగోలా ఒడ్డుకు చేరకుని ప్రాణాలతో బయటపడగా ఇద్దరు చిన్నారులు (దీక్షిత్, ప్రణీత) సహా తల్లి నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు.
తల్లీబిడ్డల ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మహిళతో పాటు ఇద్దరు చిన్నారుల మృతదేహాలను చెరువులోంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆత్మహత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కట్టుకున్న భార్య శివరాణితో పాటు ఇద్దరు బిడ్డల మృతికి కారణమైన భిక్షపతిపై బంధువులు దాడికి దిగారు. ఇదితెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భర్త భిక్షపతి, అత్త రాములమ్మను అదుపులోకి తీసుకున్నారు. వారిపై 498ఏ, 302, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
పోస్టుమార్టం ముగియడంతో ముగ్గురి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో గురవారం అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారుల మృతదేహాలను బంధువులు చేతులపై మోస్తూ, శివరాణి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకువెళుతున్న దృశ్యం అందరినీ కలచివేసింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అంత్యక్రియల సమయంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేసారు. భార్యతో పాటు కన్నబిడ్డల మృతికి కారణమైన భిక్షపతిని కఠినంగా శిక్షించాలని బంధువులతో పాటు గ్రామస్తులు పోలీసులు కోరుతున్నారు.
