తనకు పెళ్లి చేయడం కోసం తండ్రి అప్పులు చేయడాన్ని ఆ యువతి తట్టుకోలేకపోయింది. తన కారణంగా తండ్రి అప్పులపాలై.. తాను తండ్రికి భారం కావడం నచ్చలేదు. దీంతో.. తాను లేకుంటే.. తన కుటుంబానికి ఏ బాధలు ఉండవు కదా అని భావించింది. అంతే.. వెంటనే.. బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సదాశివనగర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భూంపల్లి గ్రామానికి చెందిన వాగుమారి ప్రవళిక(26)కు తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. ఈనెల 3న భూంపల్లి గ్రామంలో నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి వరకట్నం కింద రూ.8లక్షల నగదు, నాలుగు గుంటల భూమి ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. నా పెళ్లి కోసం ఇంత ఖర్చు పెట్టి ఎందుకు పెళ్లి చేస్తున్నారని, అసలే మీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని పలుమార్లు తల్లిదండ్రులతో చెప్పుకుంటూ యువతి బాధపడేది.

పెళ్లి కోసం ఎక్కువ వరకట్నం ఇస్తున్నారని మనస్తాపం చెంది గ్రామ సమీపంలో బావిలో పడి శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. బావిలో దూకడానికి ముందు ‘నన్ను వెతకకండి.. నేను బావిలో పడి చనిపోతున్నా..’ అని చిన్న బావ సంజీవరావ్‌కు ఫోన్‌ చేసి చెప్పింది. సంజీవ్‌రావ్‌ వెంటనే కుటుంబీకులకు విషయం తెలిపి బావి వద్దకు వెళ్లి పాతాలగరిగెతో వెతకగా శవం బయటపడింది. 

మృతదేహాన్ని చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. పెళ్లి కోసం ఆర్థిక భారం ఎక్కువ అవుతుందనే మనస్తాపంతో గాజు బావిలో దూకి మృతి చెందినట్లు ఈ సందర్భంగా ఎస్సై తెలిపారు. చందర్‌రావ్‌కు ముగ్గురు కూతుళ్లు కాగా ఇద్దరి కూతుళ్ల పెళ్లిళ్లు చేశాడు. మూడో కూతురు ప్రవళిక కావడం గమనార్హం. మృతురాలి తండ్రి చందర్‌రావ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.