హైదరాబాద్: అప్పు తీర్చాలని కోరినందుకు వివాహితను అసభ్యంగా  దూషించడంతో  ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన  హైద్రాబాద్ కూకట్‌పల్లిలో చోటు చేసుకొంది.

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల గ్రామానికి చెందిన మేడికొండ పృథ్వీ గణేష్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్ాడు. ఇతడు భార్య కృష్ణవేణితో కలిసి కేపీహెచ్‌బీలోని ధర్మారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు.  

ఎనిమిది మాసాల క్రితం జగ్గయ్యపేటకు చెందిన వేల్పుల సతీష్ కు  గణేష్ రూ. 9 లక్షలను అప్పుగా ఇచ్చాడు. రెండు  నెలల్లో డబ్బులు తిరిగి ఇస్తామని అగ్రిమెంట్ రాసుకొన్నారు. కానీ, డబ్బులు తిరిగి చెల్లించలేదు. ఈ విషయమై సతీష్‌ ఈ నెల 9వ తేదీన సాయంత్రం డబ్బులు ఇస్తామని చెప్పి గణేష్ కు ఫోన్ చేశారు. 

భార్య కృష్ణవేణి స్నేహితుడు బాలాజీతో కలిసి గణేష్ ... సతీష్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో  సతీష్  గణేష్‌ను తీవ్రంగా తిట్టాడు. దీంతో గణేష్ అక్కడి నుండి వెళ్లిపోయాడు.  అదే రోజు రాత్రి సతీష్  రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో  గణేష్ ఇంటికి వచ్చాడు.

గణేష్‌పై దాడికి సతీష్ ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నాన్ని గణేష్ భార్య కృష్ణవేణి అడ్డుకొనే ప్రయత్నం చేసింది. ఆమె పట్ల కూడ అసభ్యకరంగా మాట్లాడాడు.  నా వద్ద నీ వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. వాటిని బయటపెడతానని బెదిరించి వెళ్లిపోయాడు. 

దీంతో మనస్తాపానికి గురైన కృష్ణవేణి సోమవారం తెల్లవారుజామున ఉరేసుకొని  ఆత్మహత్యకు పాల్పడింది. గణేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.