గొంతులో కత్తితో పొడిచి ఓ వివాహితను అతి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే అదనపు కట్నం కోసం ఆమెను హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే...

సిద్ధిపేట జిల్లా చెంచలచెరువుపల్లి గ్రామానికి చెందిన దానబోయిన వెంకటయ్య పెద్ద కుమార్తె అంజలి(23)ని, అదే జిల్లా హుస్నాబాద్ మండలానికి చెందిన క్యాబ్ డ్రైవర్ జెట్టి శ్రీకాంత్ కు ఇచ్చి 2018లో వివాహం చేశారు. కట్నకానుకల కింద రూ.6లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. వారికి 7 నెలల బాబు కూడా ఉన్నాడు. పెళ్లి తర్వాత శ్రీకాంత్ భార్య అంజలితో కలిసి జవహర్ నగర్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు.

కొంతకాలం పాటు వారి కాపురం సజావుగానే సాగింది.  ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడం మొదలయ్యాయి.  అదనపు కట్నం తేవాలంటూ శ్రీకాంత్ భార్య అంజలిని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో.. అంజలి ఈ విషయం తన కుటుంబసభ్యులకు తెలియజేసి పంచాయితీ కూడా పెట్టింది. పెద్దలు ఇద్దరితో మాట్లాడి రాజీ కుదిర్చారు.

Also Read ఇద్దరు భార్యలు చాలక మరో స్త్రీతో వివాహేతర సంబంధం... చివరకు...

కొంతకాలం పాటు బాగానే ఉన్న శ్రీకాంత్ మళ్లీ ఇబ్బందులుపెట్టడం మొదలుపెట్టాడు. దీంతో ఈసారి అంజలి తల్లిదండ్రులు అల్లుడు శ్రీకాంత్ కి మరో రూ.2లక్షల నగదు అదనపు కట్నంగా ఇచ్చారు. ఈ క్రమంలో అనుకోకుండా అంజలి దారుణహత్య కు గురైంది. ఆమె గొంతులో కత్తి దించి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.

అయితే.. తమ అల్లుడే హత్య చేశాడంటూ అంజలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా.. దొంగతనానికి వచ్చిన దుండగులు ఈ పని చేశారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్టున్నారు. భర్త శ్రీకాంత్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.