Asianet News TeluguAsianet News Telugu

కోదండరామ్ తెలంగాణా కేజ్రీవాల్ అవుతున్నారా?

 ప్రత్యామ్నాయ రాజకీయాలంటూ జనసమీకరణ చేస్తున్న కోదండరామ్ కూడా  తెలంగాణాలో కేజ్రీవాల్ లాగా ఒక ఉరుము ఉరిమే అవకాశం ఉందా...

will Kodandaram become kejriwal of Telangana

కోదండ్ రామ్ తెలంగాణా కేజ్రీవాల్ అవుతారా?

 

కేజ్రీవాల్ రాజకీయాలతో చాలా మందికి ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన చాలా మంది మిత్రులు తర్వాత ఆయన్ను వదిలేసి ఉండవచ్చు. అయితే, కేజ్రీవాల్ అనగానే, ఢిల్లీ కోటను పిండిచేసిన వీరుడిలాగానే కనబడతాడు.  నరేంద్రమోడీ ఎక్కడ,కేజ్రీవాల్ ఎక్కడ?  ఢిల్లీ అసెంబ్లీకి పార్లమెంటుకు పట్టమని పదికిలో మీటర్ల దూరం ఉండదు. అయినా సరే నరేంద్రమోడీ ఉపన్యాసాలు, దేశంలోని ఒటర్లందరిని తనవైపు తిప్పుకున్న ఆయన వశీకరణ విద్య  పార్లమెంటు బయట పనిచేయకుండా న్యూట్రలైజ్ చేసిన  పిల్లకాకి  కేజ్రీవాల్.  ఒక సారి కాదు రెండు సార్లు.

 

అవినీతి వ్యతిరేకపోరాట అస్త్రం ప్రయోగించి ఢిల్లీ మీద నరేంద్రమోదీ నీడపడకుండా చేశాడు. కేజ్రీవాల్  పార్టీ రాజకీయ ధోరణి నచ్చలేదని  అన్నా హజారే వెళ్లిపోయి వుండవచ్చు. అలాగే సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ప్రఖ్యాత సోషల్ సైంటిస్టు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ కూడా కేజ్రీవాల్ కు గుడ్ బై చెప్పి వుండవచ్చు.

 

అయినా, సరే కేజ్రీవాల్ ముందుకు పోయాడు,ఢల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ జండా ఎగరేశాడు.  ఇపుడు కూడా మోదీకివ్యతిరేకంగా నిలబడి పోరాడుతున్నవాళ్లలో ఆయన ఒకరు.

 

తెలంగాణాలో ప్రత్యామ్నాయ రాజకీయాలంటూ జనసమీకరణ చేస్తున్న కోదండ్ రామ్ కూడా  తెలంగాణాలో కేజ్రీవాల్ లాగా ఒక ఉరుము ఉరిమే అవకాశం ఉందా...

 

కేజ్రీవాల్  అవినీతి వ్యతిరేక పోరాటయోధుడు అని ముద్ర వేసిన వారిలో యోగేంద్రయాదవ్ ఒకరు. భారతదేశంలో మార్పుకోసం కృషి చేస్తున్న వారిలో యాదవ్ ఒకరు. ఆయన ప్రారంభించిన స్వరాజ్ అభియాన్ లో  ప్రొపెసర్ కోదండ్ రామ్ కూడా ఉన్నారు. తెలంగాణా ఏర్పడ్డాక స్వరాజ్ అభియాన్ లో  భాగంగానే కోదండ్ రామ్ తెలంగాణా అంతా తిరిగి రైతులను కలుసుకుని వాళ్ల సమస్యలను దగ్గరుండి అధ్యయనం చేసి మరో తెలంగాణా నిర్మాణం జరగాల్సిందే అన్నారు.

 

తెలంగాణాలో ప్ర త్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరమని, పార్టీ లేకుండా  ఉత్త ఉద్యమంతో రాజకీయ  మార్పు రాదని యోగేంద్ర యాదవ్ నిన్న కోదండ్ రామ్ కు సలహా ఇచ్చారు. పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అయిన కోదండ్ రామ్ కు ఇది తెలియక కాదు.  యాదవ్ సలహాతో కోదండ్ మీద వత్తిడిపెరుగుతుంది. పార్టీ లేకుండా ముందుకు పోవడం ఎలా అనే ప్రశ్న ప్రజలందరిలో మెదిలేలా చేశారు యాదవ్.

 

యోగేంద్ర యాదవ్ తో సాహచర్యం వల్ల దేశంలోని మేధావులంతా మరొక సారి తెలంగాణా వైపు చూసే అవకాశం ఉంది. ఒక వైపు ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలకు తెలంగాణాను హబ్ చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రయత్నం చేస్తుంటే, నిజమయిన, సామాజిక, ప్రజల తెలంగాణా అంటూ ప్రొఫెసర్ కోదండరామ్ సొంత పార్టీ ఏర్పాటు దిశలో పయనిస్తూ ఉండటం దేశంలో తప్పక అసక్తి రేకెత్తిస్తుంది. టిఆర్ ఎస్ ప్రభుత్వానికి విశ్వసనీయత సమస్య వచ్చే ప్రమాదం రోడ్డు మలుపులోనే కనబడుతూ ఉంది.

 

బాల్కసుమన్ వంటి యువ ఎంపిలను, ఇతర టిఆర్ ఎస్ నాయకులను రంగంలోకి దింపి తెలంగాణా లో కోదండరామ్ విధ్వంసక పాత్ర పోషిస్తున్నాడని ప్రజలకు నచ్చచెప్పే ప్రయత్నం జరగవచ్చు. మేధావిఅయిన కోదండరామ్ కు దేశ వ్యాపిత మేధావులనుంచి చాలా అండ ఉంది. ఇది, సామాజిక తెలంగాణానినాదాన్ని,  కార్పొరేట్ వ్యతిరేక రాజకీయాలను తెలంగాణా పొలిమేరలు దాటించి తీరుతుంది. అదే ప్రమాదం. కేజ్రీవాల్ హీరో అయింది కూడా ఇలాగే.

 

ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి వోడిపోవడం కొత్త కాదు. షీలా దీక్షిత్ మూడుసార్లు కాషాయపార్టీని చుట్టచుట్టి యమున లో పడేసింది.  అది విశేషం కాదు. కాని అవినీతి వ్యతిరేక పోరాటం జరిపి  ఒక అనామకుడు హీరో కావడం ఈ దశాబ్దం విశేషం.   ఐఆర్ ఎస్ అధికారి  అయిన కేజ్రీవాల్ కాకలు తీరిన యోధుడు నరేంద్ర మోదీని మట్టికరిపించడం విశేషం .  కోదండరాం నేతృత్వంలో విలువలతో కూడిన పార్టీ ఏర్పాటు అవుతుందనే విషయంలో అనుమానం లేదని యోగేంద్ర యాదవ్  ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సర్టిఫికేట్ చాలా దూరం వెళుతుంది.

 

 అయ్యవారు కోదండరామ్ కు చాపకిందనీరులాగా మద్ధతూ పెరుగుతూ ఉందని చెబుతున్నారంతా.

Follow Us:
Download App:
  • android
  • ios