Asianet News TeluguAsianet News Telugu

వనస్థలిపురం హత్య వెనక ఇదీ..: కూతురిపై కన్నేశాడు, మిత్రుడితో కలిసి భర్తను చంపింది

హైదరాబాదులోని వనస్థలిపురంలో జరిగిన హత్య మిస్టరీ వీడింది. భార్యనే మిత్రుడి సాయంతో గగన్ అగర్వాల్ ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. తన కూతురిపై కన్నేయడం వల్లే చంపినట్లు ఆమె తెలిపింది.

Wife with the help of friend killed husband at Vanasthalipuram
Author
Vanasthalipuram, First Published Mar 11, 2021, 7:32 AM IST

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వనస్థలిపురంలో జరిగిన హత్య మిస్టరీ వీడింది. మిత్రుడితో కలిసి భార్యనే హత్య చేసి ఇంట్లోని సెప్టిక్ ట్యాంకు గోతిలో శవాన్ని పూడ్చిపెట్టినట్లు తేలింది. అందరినీ తప్పుదారి పట్టించడానికి ఆమె పంపిన మెసేజ్ లు ఆమెను పోలీసులకు పట్టించాయి. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. 

హైదరాబాదులోని బేగంబజారుకు చెందిన గగన్ అగర్వాల్ (40) ఇంటీరియర్ డిజైనర్. కుటుంబ కలహాలతో భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం పాతబస్తీకో చెందిన నౌశిన్ బేగం(38)తో అతనికి పరిచయమైంది. ఆమెకు నలుగురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. ఆమె కూడా భర్త నుంచి విడాకులు తీసుకుంది. 

గగన్ అగర్వాల్ ను పెళ్లి చేసుకునేందుకు ఆమె మతం మార్చుకుంది. పేరు కూడా మార్చుకుంది. నిరుడు జూన్ 2వ తేదీన ఆర్యసమాజ్ లో ఇరువురు వివాహం చేసుకున్నారు. నౌశిద్ పిల్లలను పుట్టింట్లో ఉంచింది. గగన్ కుటుంబానికి హైదరాబాదులో నాలుగైదు చోట్ల ఇళ్లున్నాయి. మూడు నెలల క్రితం వనస్థలిపురంలోని సమీపంలోని మన్సురాబాద్ ఇంట్లోకి మారాడు. పిల్లలు అప్పుడప్పుడు వచ్చి తల్లి నౌశిద్ ను చూసి వెళ్తుండేవారు. 

గగన్ మేనకోడలికి ఫిబ్రవరి 16వ తేదీన పెళ్లి ఖరారైంది. ఖర్చుల కోసం సోదరికి అతను రూ.4 లక్షలు ఇచ్చాడు. అదే నెల 13వ తేదీన ఆమెకు తాను ఢిల్లీ వెళ్తున్నానని, ఢిల్లీ నుంచి దోహా వెళ్తున్నానని, పెళ్లికి రాలేనని, బాగా చేయండని ఓ కొత్త నెంబర్ నుంచి గగన్ పేరుతో ఎస్ఎంఎస్ వచ్చింది. అయితే ఆమె వెంటనే గగన్ ఫోన్ కు కాల్ చేసింది. అది స్విచ్ఫాఫ్ అయింది. ఎస్ఎంఎస్ వచ్చిన నెంబర్ కు ఫోన్ చేస్తే స్పందన లేదు. 

ఆనుమానం వచ్చి విషయాన్ని సోదరుడికి చెప్పింది. ఆయన ఫిబ్రవరి 18వ తేదీన నిజామాబాద్ నుంచి హైదరాబాదు వచ్చాడు. అన్న ఎక్కడికి వెళ్లాడని నౌశిద్ ను నిలదీశాడు. తనకు తెలియదని చెప్పడంతో అతను ఎల్బీనగర్ పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు నౌశిద్ ను, ఆమె కుటుంబ సభ్యులను పలుమార్లు విచారించారు. తర్వాత కేసు తమ పరిధిలోకి రాదంటూ వనస్థలిపురం పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు. 

దాంతో వనస్థలిపురం పోలీసులు విచారణ చేపట్టారు. గగన్ సోదరికి వెళ్లిన ఎస్ఎంఎస్ ఏ ఫోన్ నుంచి వెళ్లిందో గుర్తించి ఆరా తీయగా అది నౌశిద్ కు తెలిసిన వ్యక్తిదని తేలింది. అతన్ని ప్రశ్నిస్తే తనకేమీ తెలియదని, నౌశిద్ తన ఫోన్ తీసుకుని ఎస్ఎంఎస్ పంపిందని చెప్పాడు. ఆమెను పోలీసులు విచారించారు. దాంతో తానే గగన్ ను కత్తితో పొడిచి చంపినట్లు చెప్పింది. శవాన్ని ఇంటిలోని సెప్టెక్ ట్యాక్ కోసం తవ్విన గోతిలో వేసి పూడ్చిపెట్టినట్లు తెలిపింది. తన కూతురు (16) మీద గగన్ రెండు, మూడు సార్లు అత్యాచారం యత్నం చేశాడని, అందువల్లనే తాను అతన్ని చంపానని చెప్పింది.

ఆ తర్వాత మరో పేరు తెర మీదికి వచ్చింది. నౌశిద్ ను ప్రశ్నించగా ఆమె తన మిత్రుడు సునీల్ పేరు చెప్పింది. గగన్ మిత్రుడు సునీల్ తరుచుగా వాళ్ల ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో అతనికి నౌశిద్ తో పరిచయమై, వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ముందుకు వేసుకున్న పథకం ప్రకరం ఫిబ్రవరి 8వ తేదీన సునీల్ గగన్ ఇంటికి వెళ్లాడు. 

ముగ్గురు కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో నౌశిద్ కు, గగన్ కు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ గొడవలో సునీల్ గగన్ కాళ్లూ చేతులూ పట్టుకోగా, నౌశిద్ కత్తితో పొడిచి చంపింది. సునీల్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios