హైదరాబాద్‌లో భర్తను చంపిన భార్య.. ఐదుగురు దోషులకు యావజ్జీవ శిక్ష
భర్త వేధింపులను తాళలేక ఆయనను మరికొందరితో కలిసి కట్టుకున్న భార్య హతమార్చింది. ఈ కేసును విచారించిన కోర్టు ఐదుగురిని దోషులుగా తేల్చింది. వారికి జీవితఖైదు శిక్ష విధించింది. రూ. 10వేల చొప్పున జరిమానా విధించింది.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఓ వివాహిత కట్టుకున్న భర్తనే కడతేర్చింది. తరుచూ వేధింపులకు పాల్పడుతున్నాడని, తాగి అరాచకాలకు పాల్పడుతున్నాడని వీటన్నింటికి పరిష్కారంగా భర్తనే హతమార్చాలని పథకం వేసింది. తన బంధువులతో కలిసి ఆ పథకాన్ని అమలు చేసింది. చనిపోయిన వ్యక్తి సోదరుడు వీరిపై కేసు నమోదు చేశారు. భర్తను చంపిన కేసులో భార్యతోపాటు మరో నలుగురు దోషులుగా తేలారు. వారికి జీవితఖైదు పడింది. అంతేకాదు, రూ. 10 వేల జరిమాణానూ కోర్టు విధించింది.
బండి సురేశ్ కుమార్ మరణంపై సోదరుడు మాధవ రావు మీర్‌పేట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు, పోలీసుల వివరాల ప్రకారం, బండి సురేశ్ కుమార్ర, శ్రీలతలు 2004లో పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ల వరకు సంతోషంగా వారి దాంపత్యం సాగింది. వారికి ఇద్దరు పిల్లలు. సురేశ్ తన ఇల్లు వదిలేశాడు. దీనిపై దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. భర్తను వదిలి శ్రీలత పిల్లలతో తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. వారు ఆమెకు సరూర్‌నగర్‌లోని బదంగ్‌పేట్‌లో ప్లాట్ కొని ఇల్లు కట్టించారు. సురేశ్ మళ్లీ ఆమె దగ్గరకు వచ్చి కలిసి ఉండటం ప్రారంభించాడు.
ఆటో నడిపే సురేశ్ ఇంటికి డబ్బులు ఇవ్వకుండా మద్యం తాగి దుబారా చేసేవాడు. మళ్లీ గొడవలు మొదలయ్యాయి. తన అప్పులను తీర్చడానికి ఇల్లు తన పేరు చేయాలని భార్యను డిమాండ్ చేశాడు. ఆమె అంగీకరించలేదు. గొడవలు ముదిరాయి. ఓ రోజు ఆ ఇంట్లో కిరాయికి ఉంటున్న వారి గది గ్లాస్‌లు పగులగొట్టాడు. కిరాయికి ఉండేవారు ఈ విషయాన్ని శ్రీలతకు తెలిపారు. ఆమె ఈ విషయంతోపాటు తన భర్తతో ఎదుర్కొంటున్న వేధింపులను కుటుంబీకులకు తెలియజేసింది. సురేశ్‌ను హతమార్చి తన సమస్యలకు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందిగా అర్థించింది. అందరు బదంగ్‌పేట్‌లోని ఇంటికి చేరగా సురేశ్ బెడ్ రూమ్ అద్దాలు పగులగొట్టి నిద్రలో ఉన్నాడు. ఆ విధ్వంసాన్ని చూడగానే శ్రీలతలో ఆగ్రహం కట్టలుతెంచుకుంది.
అప్పటికే మాట్లాడిపెట్టిన హంతకులు అక్కడికి చేరుకున్నారు. సురేశ్ నోటిలో గుడ్డలు కుక్కి అందరూ కర్రలతో చితకబాదారు. అందుకే గాయాలై, సివియర్ బ్లీడింగ్ కారణంగా మరణించాడు. ఈ కేసు విచారిస్తూ అడిషనల్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ కోర్టు జడ్జీ ఎన్ ప్రేమలత తీర్పు వెల్లడించింది. కేసులోని ఐదుగురు దోషులకు జీవితఖైదు విధించింది. రూ. 10వేల జరిమానా వేసింది. ఈ మేరకు రాచకొండ అధికారులు వెల్లడించారు.