భార్య పై అనుమానం.. నీతో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదంటూ లేఖ రాసి ఆమె అదృశ్యం..
నీతో కలిసి ఉండడం ఇష్టం లేదని లేఖ రాసిన ఓ భార్య తన 16నెలల కూతురితో అదృశ్యమయ్యింది. ఈ ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది.
హైదరాబాద్ : ‘నీతో కలిసి ఉండటం ఇష్టం లేదు’ అని భర్తకు లేఖ రాసిన భార్య 16 నెలల కూతురును తీసుకుని అదృశ్యమైన ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డికి చెందిన వదనల స్వామి, శిరీష దంపతులు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి వీఎన్ రెడ్డినగర్ ఉంటున్నారు. వారికి పాప, బాబు ఉన్నారు. స్వామి ఎలక్ట్రీషియన్ సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. పనిలో భాగంగా వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉండేవాడు. ఈ నెల 7 పని నిమిత్తం కరీంనగర్ వెళ్లాడు.
అక్కడినుంచే రోజు భార్యకు ఫోన్ లో మాట్లాడేవాడు. ఈ నెల 14న ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో పక్కింటి వారికి ఫోన్ ఉదయం షాపింగ్, సాయంత్రం బాబును తీసుకొచ్చేందుకు స్కూల్ కు వెళ్లానని చెప్పినట్లు పక్కింటివారు స్వామికి తెలిపారు. భార్య కదలికలపై అనుమానం వచ్చిన స్వామి సాయంత్రానికి ఇక్కడికి వచ్చి చూడగా శిరీషతో పాటు 16 నెలల కూతురు కనిపించలేదు. ఇంట్లో చూడగా నీతో ఉండటం నాకు ఇష్టం లేదు నా కోసం వెతకొద్దంటూ రాసిన లేఖ లభించడంతో స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హైదరాబాద్ చందానగర్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..
ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్లోని హర్దాయ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త ఆరోగ్యంగా ఉండాలని భార్య ఉపవాసం చేయగా.. అతనే ఆమె మీద కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని హర్దాయ్ లో కలకలం రేపింది. భర్త దీర్ఘకాలం పాటు ఆరోగ్యంతో ఉండాలని ఉత్తరాది మహిళలు కర్వాచౌత్ ను అత్యంత భక్తిశ్రద్ధలతో, నిష్టగా చేస్తారు. అత్యంత వేడుకగా దీన్ని నిర్వహించుకుంటారు.
గురువారం కర్వాచౌత్ పండుగ కావడంతో కొట్ వాలీ ఆజాద్ నగర్ కు చెందిన మౌనీగుప్తా ఉదయం నుంచి ఉపవాసం చేస్తోంది. అయితే సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త మనోజ్..ఆమె ఉపవాస దీక్షను విరమింపచేయాల్సింది పోయి.... ఒక్కసారిగా పదునైన కత్తితో భార్య మీద విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా శరీరంపై 12 చోట్ల తీవ్రంగా గాయపరిచాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. దీంతో ఘటనా స్థలంనుంచి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. అయితే, మోనీ-మనోజ్ కు 22 యేళ్ల క్రితం వివాహమయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు. గత కొంతకాలంగా భర్త మనోజ్ మోనీని వేధింపులకు గురిచేస్తున్నట్లు బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనకు మూడు రోజుల ముందు సైతం మనోజ్ మోనీని కొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే, పోలీసులు ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. దీంతో పరిస్థితి ఇంతకు దిగజారింది. మనోజ్ ఒక్కసారిగా భార్యపై దాడి చేయడానికి, హత్యాయత్నం చేయడానికి కారణం విషయమై సరైన సమాచారం లేదు. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేసిందని కోపంతోనే అతను ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. దీనిమీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.