హైదరాబాద్ చందానగర్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..
హైదరాబాద్‌లోని చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. చందానగర్ పాపిరెడ్డి కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో భార్యభర్తలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివరాలు.. బాధిత కుటుంబం చందానగర్ రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 18లో నివాసం ఉంటుంది. అయితే రెండు మూడు రోజుల నుంచి వారి ఇంటి తలుపులు మూసే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు ఇంటి తలుపులు పగలగొట్టి చూశారు.
ఇంట్లో నాగరాజు, ఆయన భార్య సుజాత, పిల్లలు రమ్యశ్రీ, టిల్లులు మృతిచెంది కనిపించారు. వీరు నలుగురు ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఒకేసారి నలుగురు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
అయితే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు కారణంగానే పిల్లలతో కలిసి నాగరాజు, సుజాత ఆత్మహత్య చేసుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ఘటనకు గల కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.